ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) ఏపీలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అత్యంత ఆసక్తికరంగా ప్రకటించారు.
మంత్రి లోకేష్ బుల్లెట్ బైక్ నడుపుతున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. “ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?” అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెంచారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏపీలో సుమారు ₹2,200 కోట్ల నుంచి ₹2,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలంలో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే సుమారు 267 ఎకరాల భూమిని కేటాయించింది.
ఉపాధి అవకాశాలు: ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 5,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. తమిళనాడు వెలుపల మొదటి ప్లాంట్: 1955లో తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్, ఆ రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి భారీ ప్లాంట్ ఇదే కావడం విశేషం.
మంత్రి లోకేష్ షేర్ చేసిన వీడియోలో ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను నడుపుతూ కనిపించారు. “Guess who’s coming to AP?” అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టును ఒక విజయంగా భావిస్తున్నారు.
Also Read:‘ఇంపాక్ట్ ప్లేయర్’..రక్షణ కవచం మాత్రమేనా?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోదం లభించింది. రెండు దశల్లో ఈ ప్లాంట్ పనులు పూర్తి కానున్నాయి. మొదటి దశ 2029 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేది కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు, అది ఒక వారసత్వం. అటువంటి ఐకానిక్ బ్రాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించడం మాకు గర్వకారణం. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి తయారీ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం..ఈ మెగా ప్రాజెక్టు రాకతో తిరుపతి జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడమే కాకుండా, అనుబంధ పరిశ్రమలకు (Vendor Parks) కూడా పెద్దపీట వేయనుంది.

