రాజ్యసభలో ఈ రోజు జరిగిన ఓ దృశ్యం తీవ్ర అనుమాలకు తావిస్తోంది. అంతేకాదు ఆ దృశ్యం ప్రస్తుత రాజకీయ వేడిని మరింత రాజేసేదిగా ఉందని భావిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అసలు విషయానికొస్తే..వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మోదీ వద్దకు వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేశారు.
ప్రధాని మోదీ రాజ్యసభలోకి వస్తున్న సమయంలో ఎంపీలందరూ నమస్కారం చేశారు. అయితే బీజేపీ ఎంపీలు,వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రమే మోదీ ప్రతినమస్కారం చేస్తూ..తన స్థానంలో కూర్చున్నారు. ఇంతలోనే విజయసాయిరెడ్డి మోదీ వద్దకు వెళ్ళి పాదాభివందనం చేశారు. దాంతో ఆయన్ని తట్టిలేపిన మోదీ విజయసాయిరెడ్డిని అభినందించారు. అనంతరం విజయసాయిరెడ్డి తన స్థానంలోకి వెళ్ళి కూర్చున్నారు.
ఈ పరిణామమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్ళూ కేంద్రం మాయమాటలు చెప్తూ ఏపీకి అన్యాయం చేస్తోందని వైసీపీ, టీడీపీ కేంద్రం పై విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్డీయే కూటమికి టీడీపీ గుడ్‌బై కూడా చెప్పేసింది. ఈ క్రమంలోనే వైకాపా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.
అయితే ఇంతగా కేంద్రంపై ఆరోపణలు చేస్తూ..వచ్చిన వైసీపీ.. అదే పార్టీకి చెందిన వ్యక్తి మోదీ కాళ్ళు పట్టుకోవడం ఎవరూ ఊహించని పరిణామం. అయితే విజయసాయిరెడ్డి మోదీకి పాదాభివందనం చెయ్యడానికి అసలు కారణం.. జగన్‌తోపాటు తనపై కూడా ఉన్న కేసుల నుంచి బయటపడేందుకేననే టాక్ వినిపిస్తోంది.
మరోపక్క… వైసీపీ కమలంతో కలిసేందుకు ప్రయత్నిస్తోందని, అందుకు ఓక రకంగా ఈ దృశ్యం సంకేతాన్నిస్తోందంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదేమైనా..మోదీ-విజయసాయిరెడ్డి మధ్య చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రస్తుత రాజకీయ రగడను మరింత రాజేసేదిగాఉందని చెప్పక తప్పదేమో.