ఇలా అరెస్టయ్యారో లేదో అప్పుడే లిక్కర్ రారాజుకు బెయిల్ మంజూరైంది. భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయిపడిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌మాల్యా లండన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్ జారీ చేసిన లెటర్ ఆఫ్ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
అరెస్టయిన మూడు గంటల్లోనే మాల్యాను బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో, మాల్యాను భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మాల్యాను ఇక్కడకు తీసుకురావడానికి సుమారు 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని ఈడీ అధికారులు చెబుతున్నారు.
మాల్యాను యూకే పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే స్థానిక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంపై నిరాశ చెందలేదని.. అతన్ని వీలైనంత త్వరగా భారత్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.
మాల్యాను భారత్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు అంత సులువేంకాదని అక్కడి కోర్టు డజను తీర్పులు ఇచ్చాక గాని అక్కడి ఉన్నత న్యాయస్థానాలు ఏ నిర్ణయానికి రాలేవని న్యాయ నిపుణులు చెప్పారు. అయితే మాల్యాను త్వరగా భారత్ తీసుకువచ్చేందుకు సీబీఐ, ఈడీ బృందం లండన్ వెళ్లనున్నట్లు సమాచారం.