విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ట్యాక్సీవాలా సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దమైంది. పలు సార్లు వాయిదాలు పడ్డ ట్యాక్సీవాలా ఎట్టకేలకు ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు ప్రియాంక జువాల్కర్ – మాళవిక నాయర్ – కళ్యాణి – మధునందన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. కొత్త డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ ఈ మూవీని తెరెకెక్కించారు.
ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 11వ తేదిన నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈమూవీని గీతా ఆర్ట్స్ మరియు యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ చిత్రానికి అల్లు అర్జున్ వ్యక్తిగత పీఆర్ ఓ అయిన ఎస్ కే ఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.బన్నీ ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో హాజరు కాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ చివరి సినిమా గీత గోవిందం ఆడియో ఫంక్షన్ కు కూడా బన్నీ ముఖ్య అతిధిగా విచ్చేసిన విషయం తెలిసిందే.