ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు విజయం సాధించారు. 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల తేడాతో వెంకయ్యనాయుడు విజయ భేరీ మోగించారు. మొత్తం పోలైన ఓట్లు 771. ఇందులో, వెంకయ్యనాయుడుకి 516, గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోని ఎంపీలలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెందిన నలుగురు, బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఐయూఎంఎల్ నుంచి ఇద్దరు, ఎన్సీపీ, పీఎంకే నుంచి ఒక్కొక్కరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 98.21. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికను రాజ్యసభ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 11న వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వెంకయ్యనాయుడు గురించిన విశేషాల గురించి చెప్పాలంటే.. 1949 జులై 1న వెంకయ్యనాయుడు జన్మించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజా హై స్కూల్ లో పదో తరగతి వరకు విద్యనభ్యసించిన ఆయన,వీఆర్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్శిటీలో న్యాయవిద్య అభ్యసించారు. చిన్నానాటి నుంచే ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న వెంకయ్యనాయుడు, ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా పని చేశారు. జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు, నాటి ఎమర్జెన్సీ సమయంలోనూ నిరసన గళం వినిపించారు.
ఇక, వెంకయ్యనాయుడు రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పాలంటే..1978లో ఉదయగిరి నుంచి అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. 1983 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపు పొందారు. 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా, 1998, 2004, 2010లో రాజ్యసభ సభ్యుడిగా,1999లో వాజ్ పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఆయన పని చేశారు. 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, 2014లో కేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రిగా వెంకయ్యనాయుడు పని చేశారు.