వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (VMC) నగరంలోని మాంసం, చాపలు, కోడిగుడ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని తీసుకున్న నిర్ణయం ఈ పుణ్యక్షేత్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం వల్ల నగరంలో పరిశుభ్రత, ఆధ్యాత్మికత పెరుగుతాయని అధికారులు చెబుతుండగా స్థానిక ప్రజలు మాత్రం ఇది తమ ఆహారపు అలవాట్లను ఇబ్బందుల్లోకి నెట్టేసే చర్యగా అభివర్ణిస్తున్నారు.
నగర పరిధిలో ఉన్న సుమారు 350 నుండి 400 మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో (ఈ ఏడాది నవంబర్‌లో వచ్చే దీపావళి నాటికి) దశలవారీగా నగర శివార్లలోని రాంనగర్, సుజాబాద్, గణేష్‌పూర్, అవలేష్‌పూర్, శివపూర్ వంటి ఐదు ప్రాంతాలకు తరలించాలని కార్పొరేషన్ ప్లాన్ ఆమోదించింది.
అయితే వారణాసి పూర్తిగా శాకాహార నగరంగా మారడం లేదు. కేవలం మాంసం దుకాణాలను నగర పరిధి దాటించి శివార్లకు తరలిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లోని ‘పాలిటానా’ మాత్రమే ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి శాకాహార నగరంగా ఉంది. జైనుల పవిత్ర క్షేత్రమైన పాలిటానాలో 2014 నుండి ఇళ్లలో కూడా మాంసం, గుడ్ల అమ్మకాలు, వినియోగంపై పూర్తి నిషేధం ఉంది. కానీ వారణాసిలో అటువంటి నిషేధం ఏమీ లేదు, కేవలం దుకాణాల స్థానాలను మాత్రమే మారుస్తున్నారు.
శివుని కాశీ కాబట్టి ఇక్కడ మాంసాహారం ఉండకూడదనే భావన సాధారణంగా ఉన్నప్పటికీ వారణాసి ఎన్నో శతాబ్దాలుగా విభిన్న వర్గాలకు, భిన్నమైన ఆహార సంస్కృతులకు నిలయంగా ఉంది. నగరంలో అత్యధికంగా ఉన్న హిందువులలోని ఠాకూర్ కుటుంబాలు, అలాగే బెంగాలీలు (చేపలు తినే అలవాటు ఉన్నవారు), ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2026 నాటి జనాభా అంచనాల ప్రకారం నగరంలో హిందువులు 68-72% ఉండగా, ముస్లింలు 27-30% వరకు ఉన్నారు. వీరందరి దైనందిన ఆహారంలో మాంసాహారం ఒక భాగం. ఇప్పుడు వీరంతా మాంసం కొనాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
ఈ నిర్ణయంపై స్థానికుల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు పరిశుభ్రత కోసం దీనిని స్వాగతిస్తుండగా, మరికొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సుందర్‌పూర్‌కు చెందిన సౌమ్య సింగ్ అనే నివాసి మాట్లాడుతూ…మాంసం దుకాణాలను తరలిస్తున్నారు సరే, మరి మహిళలకు, విదేశీ పర్యాటకులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న మద్యం దుకాణాలు, భాంగ్ (గంజాయి) షాపుల సంగతేంటి? అఘోరీ సంప్రదాయాల పేరుతో బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడం కనిపించడం లేదా? మాంసాన్ని ఇళ్ల లోపల వండుకుని తింటారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించే అంశాలను వదిలేసి, దీనిపై పడటం ఏంటి? అని ప్రశ్నించారు.
Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!
భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాల పరిపాలనా విధానాలనే వారణాసి కూడా అనుసరిస్తోంది. హరిద్వార్ లో గంగా ఘాట్లు, ప్రధాన యాత్రా మార్గాల వద్ద మాంసం, మద్యం విక్రయాలపై చాలా కాలంగా ఆంక్షలు ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో కఠినమైన శాఖాహార నిబంధనలు అమలులో ఉన్నాయి. అయోధ్య రామాలయం చుట్టుపక్కల ప్రధాన ప్రాంతాలలో మాంసాహార విక్రయాలు, డెలివరీలపై ఆంక్షలు విధించారు.
ఇదే క్రమంలో కాశీ విశ్వనాథ్ కారిడార్ అభివృద్ధి తర్వాత, నగరాన్ని మరింత వ్యవస్థీకృతంగా మార్చేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ, శతాబ్దాల చరిత్ర గల బనారస్ (వారణాసి) నగరం ఈ కొత్త మార్పులకు కూడా త్వరలోనే అలవాటు పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

