సర్దార్ 2 వర్సెస్ రణబలి!

1
- Advertisement -

పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీ వచ్చేసింది. 2022లో వచ్చిన సూపర్ హిట్ ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఒక భారీ పోటీ ఖాయమైంది. సెప్టెంబర్ 11న విడుదల కానున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల ‘రణబలి’ చిత్రంతో ‘సర్దార్ 2’ నేరుగా తలపడనుంది.

కార్తీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక చిన్న గ్లింప్స్ వీడియోను షేర్ చేస్తూ.. “#Sardar2 వస్తోంది.. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో!” అని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ పేలుడు సంభవిస్తుండగా, కార్తీ చేతిలో గన్‌ పట్టుకుని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. మొదటి భాగం లాగే ఇందులో కూడా కార్తీ ద్విపాత్రాభినయం (ఏజెంట్ సర్దార్ అలియాస్ చంద్రబోస్, మరియు విజయ్ ప్రకాష్) చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకి మంచి మార్కెట్ మరియు ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమాను తెలుగులోనూ భారీగా విడుదల చేయనున్నారు. అయితే, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రల్లో వస్తున్న పీరియడ్ డ్రామా ‘రణబలి’ సరిగ్గా మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

మరోవైపు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన హై-బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’ (Toxic) ఆగస్టు 26న విడుదల కాబోతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్, కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి నటిస్తున్న ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ‘సర్దార్ 2’, ‘రణబలి’ చిత్రాలు థియేటర్లలోకి రానుండటంతో సినిమా ప్రియులకు పండగే అని చెప్పాలి.

Also Read:రామాలయ విరాళాలకు ‘రికార్డులు’ లేవు!

- Advertisement -