2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు మరియు వారి స్థానాలపై భారత క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు, చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, అలాగే బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలెక్టర్లకు, జట్టు యాజమాన్యానికి ఒక కీలక విన్నపం చేశారు. ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు జట్టుకు అవసరమా లేదా అనేది ఇప్పుడే నిర్ణయించాలని, ఒకవేళ అవసరమైతే వారిని మానసికంగా ప్రశాంతంగా ఉంచాలని అశ్విన్ కోరారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ… రోహిత్ లేదా విరాట్ గురించి ఇలాంటి ఊహాగానాలు రావడం మంచిది కాదు. నిజాయితీగా చెప్పాలంటే, అసలు ఈ చర్చలు ఎక్కడి నుండి వస్తున్నాయి? వీరు ప్రపంచకప్‌కు వెళ్లకూడదని ఎవరో ఒకరి మనసులో ఉంది. ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. కొంతమందికి ఈ అనుమానం ఉంటుంది, మరికొందరికేమో వీరు జట్టులో ఉండాలని ఉంటుంది అన్నారు.
మీకు వారు జట్టులో కావాలనుకుంటే, ఆ నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోండి. రాబోయే ఏడాది కాలం పాటు వారు ఎంతో ప్రశాంతంగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడేలా చూసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే, భవిష్యత్తులో వారు ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ప్రతిసారీ ఇదే చర్చ మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుంది. అది జట్టుకు మంచిది కాదు అని అశ్విన్ హెచ్చరించారు.
రోహిత్, కోహ్లీల భవిష్యత్తు మరియు జట్టులో వారి స్థానంపై వారికి పూర్తి నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత సెలెక్టర్లతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే ఉందని అశ్విన్ స్పష్టం చేశారు. 2027 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో రోహిత్, కోహ్లీ ఇద్దరూ కచ్చితంగా ఉండాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌లో ఆడటానికి మన జట్టుకు అనుభవజ్ఞులైన బ్యాటర్ల అవసరం చాలా ఉందని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను అని అశ్విన్ పేర్కొన్నారు.
Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!

