అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు వానెసా హేడెన్ ట్రంప్ కోర్టుకెక్కారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ (40)తో వానెసా కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇప్పుడు తన భర్తనుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ కోడలికి తన భర్తతో వచ్చిన చిక్కేంటి అంటారా..? అలాంటిదేమీ లేదు. ఇష్టపూర్వకంగానే తన వివాహబంధానికి ముగింపుపలకాలని డిసైడయ్యారు భార్యాభర్తలు.
పరస్పర అంగీకారంతోనే తమకు విడాకులు మంజూరు చెయ్యాలని కోరుతూ..వానెసా..మ్యాన్‌హటన్ కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేసినట్టు ‘దిన్యూయార్క్ టైమ్స్’ ఒక కథనంలో పేర్కొంది.
2003లో డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ఒక ఫ్యాషన్‌లో జూనియర్ ట్రంప్.. మోడల్ వానెసాను కలిశారు. ఆ పరిచయం రెండేళ్ళ తర్వాత 2005లో పెళ్ళికి దారితీసింది. ఇప్పుడీ ఇద్దరికీ ఐదుగురు పిల్లలున్నారు. అయితే ఈ దంపతులిద్దరూ గతంలోనే ‘పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత.. మేమిద్దరం వేరు కావాలని నిర్ణయించుకున్నామ’ని సంయుక్త ప్రకటన చేశారు.
ఈ క్రమంలోనే వారు విడిపోతున్నప్పటీకీ ఒకరిపట్ల ఒకరికి గౌరవముందని, ఇప్పటికీ వారి పిల్లలకే తొలిప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ సమయంలో వారికి కొంత గోప్యత కావాలని కూడా తెలిపారు.