రీఛార్జీ యాప్‌గా అడుగుపెట్టి షాపింగ్ స్టోర్, పేమెంట్ బ్యాంక్‌గా ఎదిగిన పేటీఎం ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించింది. డిజిటల్, యూపీఐ లావాదేవీల పరంగా పేటీఎం దేశంలోనే అగ్ర స్థానానికి చేరింది.
ఫిబ్రవరి నెలలో పేటీఎం ద్వారా 171.4 (17.4 కోట్లు) మిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) ప్రకటించింది. జనవరి నెలలో నమోదైన లావాదేవీల కంటే 13.5 శాతం ఎక్కువ. ఇందులో యూపీఐ ఆధారిత లావాదేవీలు 6.8 కోట్లు ఉన్నాయి.
దేశంలో మొత్తం జరిగిన యూపీఐ లావాదేవీల్లో 40 శాతానికి సమానం. జనవరిలో పేటీఎం ద్వారా యూపీఐ లావాదేవీలు 5.12 కోట్లు జరగ్గా, గత డిసెంబర్ లో 3.7 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నాయి. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) అన్నది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్ పీసీఐ) అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ ఫామ్.
ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్ సీ వంటివి అవసరం లేకుండా సులభంగా బ్యాంకు ఖాతా నుంచి అప్పటికప్పుడే చెల్లింపులు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ప్రారంభించిన మూడు నెలల్లోనే యూపీఐ లావాదేవీల పరంగా తాము నంబర్ 1 స్థానానికి చేరినట్టు పేటీఎం తెలిపింది.