SP:కాంగ్రెస్ ఆశలకు అఖిలేష్‌ గండి

4
- Advertisement -

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. తమ స్థానాలను బలోపేతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియా (I.N.D.I.A) కూటమి, ఎన్డీఏ (NDA)లలో సీట్ల సర్దుబాటు ఇంకా తుది రూపు దాల్చనప్పటికీ, భాగస్వామ్య పక్షాలు ఎక్కువ సీట్ల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్‌కు అంత పెద్ద మొత్తంలో సీట్లు ఇవ్వడానికి సుముఖంగా లేదు. గతం మరియు ఇటీవలి ఎన్నికల ప్రదర్శనను ప్రాతిపదికగా తీసుకుని తక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించాలని యోచిస్తోంది.

కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు ఫార్ములాను రూపొందించే క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రధానంగా ఎన్నికల ప్రదర్శనపైనే దృష్టి సారిస్తోందని వర్గాలు తెలిపాయి. కూటమి కింద కాంగ్రెస్‌కు 53 నుండి 55 సీట్లను ప్రతిపాదించాలని ఎస్పీ భావిస్తుండగా, తాము మాత్రం దాదాపు 350 స్థానాల్లో అభ్యర్థులను దింపేందుకు సిద్ధమవుతోంది.

ఎస్పీ బలంగా ఉన్న స్థానాలపై దృష్టి సారించే విధానాన్ని అనుసరిస్తోంది. తమకు పట్టున్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ ప్రతిపాదిత ఫార్ములా 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్‌లో ఆరు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. ఈ ఆరు ఎంపీ స్థానాల పరిధిలోకి 30 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అలాగే కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయిన ఇతర లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మరో 11 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

కాంగ్రెస్ గెలిచిన, ఓడిపోయిన ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల వారీగా సాధించిన ఓట్లను లెక్కించి, కాంగ్రెస్‌కు 53 నుండి 55 సీట్ల సంఖ్యను ఎస్పీ ప్రతిపాదించినట్లు సమాచారం. అదేవిధంగా ఎస్పీ తాను గెలుచుకున్న 37 లోక్‌సభ స్థానాలతో పాటు, ఓడిపోయిన చోట్ల అసెంబ్లీ స్థాయిలో సాధించిన ఓట్లను అంచనా వేసుకుంది. ఈ విశ్లేషణ ఆధారంగా తాము 350 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఎస్పీ వర్గాలు తెలిపాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు పలుమార్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, సహారన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ పలు వేదికలపై ఈ డిమాండ్‌ను బహిరంగంగానే ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కాంగ్రెస్ నాయకులు సమాజ్‌వాదీ పార్టీపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఎస్పీ మాత్రం తమ ఫార్ములాను పెద్దగా మార్చడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది.

2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేశాయి. అప్పుడు రెండు పార్టీల మధ్య 298:105 సీట్ల సర్దుబాటు కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. అయితే ఈ ఫార్ములా అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురై, కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీలూ అభ్యర్థులను నిలబెట్టాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీ చివరికి 311 స్థానాల్లో, కాంగ్రెస్ 114 స్థానాల్లో పోటీ చేశాయి. తుది ఫలితాల్లో ఎస్పీ 47 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలకే పరిమితమైంది.

Also Read:ఓటు హక్కుపై గాంధీజీ తొలి పోరాటం

- Advertisement -