కండక్టర్‌గా మారిన సీఎం విజయ్

3
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శుక్రవారం ‘వెట్రి పయనం తిట్టం’ (విజయ ప్రయాణ పథకం)ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని మరింత విస్తరించారు.గాంధీ జయంతి సందర్భంగా ఈ పథక విస్తరణను ప్రారంభిస్తూ, సీఎం విజయ్ చెన్నైలో స్వయంగా బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటించడమే కాకుండా మహిళలకు స్వయంగా ఉచిత టిక్కెట్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న కళాశాల విద్యార్థులు ముఖ్యమంత్రికి ‘డైరీ మిల్క్’ చాక్లెట్లను పంచుతూ సందడి చేశారు.

ఈ విస్తరించిన పథకం ద్వారా ప్రతిరోజూ సుమారు 84.32 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని అంచనా. ఏడు రాష్ట్ర రవాణా సంస్థలు నడిపే 12,695 బస్సుల్లో (ఎక్స్‌ప్రెస్ మరియు డీలక్స్ కేటగిరీలతో సహా) లబ్ధిదారులు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి ఎటువంటి ఆదాయ పరిమితి లేదని, అలాగే ఒక రోజులో లబ్ధిదారులు ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.ఆధికారంలో ఉన్న ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ పేరు మీదుగా రూపుదిద్దుకున్న ఈ పథకం గతంలో కొన్ని రకాల బస్సులకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు విస్తరించిన సదుపాయం ద్వారా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మోఫుసిల్ ఆర్డినరీ మరియు కొన్ని కొండ ప్రాంతాల (ఘాట్ రోడ్) బస్సు సేవలకు కూడా ఇది వర్తిస్తుంది.

అంతకుముందు రవాణా శాఖ మంత్రి ఎ. విజయ్ తమిళన్ పార్తీబన్ మాట్లాడుతూ— మహిళలు, ట్రాన్స్‌జెండర్ల విద్య, ఉపాధి, జీవనోపాధి మరియు ఆర్థిక సాధికారతకు రవాణా ఖర్చులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడం, ప్రయాణ హక్కులలో ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

మహిళలు మరింత స్వతంత్రంగా మారి, ఇళ్ల నుంచి బయటకు వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఈ పథకం ఒక “సామాజిక విప్లవం” లాంటిదని మంత్రి అభివర్ణించారు.

- Advertisement -