ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ ఉపశమనం కలిగించే కీలక ప్రకటన చేశారు. 1 కోటి మంది మహిళలకు గరిష్టంగా రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం రూ. 1 లక్షను మహిళలకు ఎలాంటి వడ్డీ లేకుండా మూడు విడతల్లో (3 installments) అందజేస్తారు. ప్రతిపాదిత ‘ఉత్తర ప్రదేశ్ మహిళా ఉద్యమి క్రెడిట్ యోజన’ కింద మొత్తం రూ. 1 లక్ష ప్రయోజనం పొందేలా రుణం అందించనున్నారు.
మొదటి విడత: రూ. 20,000 క్రెడిట్ లభిస్తుంది.
రెండో విడత: మొదటి విడత రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన లబ్ధిదారులు రూ. 30,000 రెండో విడత రుణానికి అర్హులవుతారు.
మూడో విడత: రెండో విడతను సకాలంలో చెల్లించిన తర్వాత రూ. 50,000 మూడో విడతగా లభిస్తుంది.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు ఆర్థిక చేయూత అందించడంపై రాజకీయ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ క్రెడిట్ పథకాన్ని ప్రతిపాదించారు. అంతకుముందు మహిళలకు రూ. 50,000 ఆర్థిక సాయం అందిస్తారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ (UPSRLM) తో ముడిపడి ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ పథకం ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. యోజనా భవన్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. అర్హులైన మహిళలకు ఒక ప్రత్యేక క్రెడిట్ కార్డ్ అందిస్తారు. దీని ద్వారా వారు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
Also Read:బిగ్ బాస్ హౌస్ గోడ దూకిన కంటెస్టెంట్!
ఈ సదుపాయం కోసం ప్రాథమిక కార్యాచరణను సిద్ధం చేయాలని బ్యాంకులను కోరగా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక ప్రతిపాదనపై పనిచేస్తోంది. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల డిజిటల్ సామర్థ్యాలను పెంచేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. QR-కోడ్ ఫీచర్లతో డిజిటల్ గుర్తింపు కార్డులు, డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్ మరియు ఆర్థిక సేవలతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించింది.

