తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన హైదరాబాదుకు వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరెశ్వర్ పాటిల్ ను శుక్రవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో కలిసి హైదరాబాదులోని హోటల్ మారియట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల వల్ల పల్లెల సమగ్ర స్వరూపం మారుతున్నదని ఆయన ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు లాంటి ప్రజా ప్రజపయోగ కార్యక్రమాలను వినియోగించడం అభినందనీయమైన విషయమని ఆయన అన్నారు.
14 వ ఫైనాన్స్ కమిషన్ నిధులకన్నా, 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు ఇస్తున్న గ్రాంటు తక్కువగా ఉందని, అందువల్ల 15 వ. కమిషన్ ద్వారా ఇస్తున్న గ్రాంటును పెంచాలని మంత్రి దయాకర్ రావు కోరగా, తప్పక పరిశీలించి నిధులను మంజూరు చేస్తామని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 1000 గ్రామ పంచాయతీల నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరగా, కేంద్ర సహాయ మంత్రి సానుకూలంగా స్పందించారు.
గ్రామపంచాయతీలలో పనిచేసే సెక్రెటరీలు, ఇతర సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వెల్డంకి, ఎస్ లింగోట గ్రామాల్లో అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల పరిశీలనకు కేంద్ర సహాయ మంత్రి కపిల్ మోరెశ్వర్ పాటిల్ వెళ్లారు.