కరోనా వైరస్‌లో ఎలాంటి జన్యుమార్పు లేదు..

183
Union Health Minister
- Advertisement -

భారత్‌లో కరోనా వైరస్ పీక్ స్టేజీ దాటిపోయింది. ఇక తగ్గుదల ఆరంభం అవుతుంది. సాధారణంగా వైరస్ లు కాలం గడిచే కొద్దీ జన్యుమార్పులకు గురవుతుంటాయి. కొన్నిసార్లు అవి బలహీనపడతాయి. మరికొన్ని సందర్భాల్లో రూపం మార్చుకుని మరింతగా విజృంభిస్తుంటాయి. అయితే, భారత్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ లో ఎలాంటి జన్యుమార్పు (మ్యుటేషన్) లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనా జన్యువుల్లో మార్పులు జరిగినట్టు ఇప్పటివరకు సమాచారం లేదని తెలిపారు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన రెండు అధ్యయనాల్లో ఈమేరకు స్పష్టమైనట్టు అటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పష్టం చేసింది. భారత్ లో ఈ మహమ్మారి వైరస్ జన్యుపరంగా ఎంతో నిలకడగా ఉన్నట్టు అర్థమవుతోందని పేర్కొంది. ఈ అధ్యయనాలను ఐసీఎంఆర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) నిర్వహించినట్టు తెలిపింది. వైరస్ జన్యుక్రమం పరివర్తన చెందుతూ వేగంగా రూపాంతరం చెందినట్టయితే అది వ్యాక్సిన్ లకు కూడా లొంగని విధంగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. భారత్ లో అలాంటి పరిస్థితి లేకపోవడం ఊరట కలిగించే విషయం.

కాగా ఫిబ్రవరి చివరి నాటికి భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కోటీ ఐదు లక్షలకు చేరే అవకాశం ఉన్నట్టు కేంద్ర కమిటీ అంచనా వేసింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 75 లక్షలు దాటింది.ఒకవేళ మార్చిలో లాక్ డౌన్ విధించకపోయి ఉంటే ఆగస్టు చివరికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 25 లక్షలు దాటే అవకాశం ఉందని కమిటీ చెప్పింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల సంఖ్య 1.14 లక్షలు.

- Advertisement -