పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత, ఈరోజు హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుని కలిసి.. నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతి పత్రం సమర్పించారు.నిరుద్యోగుల ఆవేదనను సావధానంగా విన్న హరీశ్ రావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్, రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని హరీశ్ రావు గారు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16 వేలు, 17 వేల చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖ లోనే దాదాపు 48 వేల పోస్టులు భర్తీ చేసామని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రంలో 19,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి, డీజీపీ చెబుతుంటే.. కేవలం 5 వేల ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ ఇస్తామనడం నిరుద్యోగులను వంచించడమేనని హరీశ్ రావు గారు విమర్శించారు.తక్షణమే మొత్తం 19 వేల ఖాళీల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే, అందులో 2 వేల పోస్టులు హైదరాబాద్ పరిధిలోకే వెళ్లిపోతాయని.. మిగిలిన పోస్టుల్లో గ్రామీణ ప్రాంతాలకు, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో కులానికి ఒక్క పోస్టు కూడా దక్కదని, దీనివల్ల గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ రెండున్నర సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని హరీశ్ రావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన ఏజ్ లిమిట్ ను వెంటనే రద్దు చేసి, బీఆర్ఎస్ హయాంలో ఉన్నట్లుగానే కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈవెంట్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీశ్ రావు గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు ఈవెంట్లలో మూడింటికి అర్హత సాధిస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షాట్ పుట్ లలో దూరం పెంచి మూడింటికి మూడు క్వాలిఫై కావాలనడం అన్యాయమన్నారు. వెంటనే పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వేల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే తక్షణం అప్లికేషన్ ఫీజు లేకుండా స్వీకరించాలని డిమాండ్ చేశారు.దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం సరైన గ్రౌండ్స్ లేవని, వారికి ప్రతిరోజూ కొంత సమయం పాటు సమీపంలోని పోలీసు లేదా ఇతర గ్రౌండ్స్ కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్
నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, 19 వేల పోస్టులతోపాటు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సాధించేదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీశ్ రావు గారు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు.

