చైనాలో నరమేధం నిజమే యూఎన్‌ రిపోర్ట్‌

182
china
- Advertisement -

చైనా దారుణ‌మైన రీతిలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి త‌న నివేదిక‌లో ఆరోపించింది. ఉగ్రవాదుల నిర్మూలన పేరిట తమ దేశంలోని మైనార్టీలపై మారణహోమానికి పాల్పడుతోందన్న అంతర్జాతీయ సమాజం ఆందోళన నిజమేనని తేలింది. షిన్‌ జియాంగ్‌ ప్రాంతంలో వీగర్‌ ముస్లింలు ఇతర మైనార్టీలపై చైనా హింసకు పాల్పడుతోందన్న ఆరోపణలు నమ్మదగినవేనని ఐరాస మానవహక్కుల సంఘం నివేదిక వెల్లడించింది. అక్కడ మనుషులపై దారుణమైన నేరాలు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. షిన్జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు మైనార్టీలపై హింసాకాండపై జర్నలిస్టులు స్వతంత్ర సలహా బృందాలు జరిపిన పరిశోదనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

చైనాలోని పశ్చిమ షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా 10లక్షల మందికి పైగా వీగర్లు ఇతర ముస్లిం మైనార్టీలను డ్రాగన్‌ సర్కార్‌ నిర్భంధ శిబిరాలకు తరలించింది. అవి కేవలం వృత్తి విద్యా శిక్షణా కేంద్రాలు మాత్రమే అని అతివాదం తీవ్రవాదాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు చైనా చెబుతోంది. దీంతో అక్కడి మైనార్టీల భద్రతపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఉగ్రవాద నిర్మూలన పేరుతో చైనా నరమేధానికి పాల్పడుతోందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపించాయి. ఆ రిపోర్ట్‌ను చైనా ఖండించింది. పాశ్చాత్య దేశాలు త‌ప్పుడు నివేదిక‌ను రూపొందించిన‌ట్లు చైనా విమ‌ర్శించింది. వీగర్ ముస్లింల‌ను చిత్ర‌హింస పెట్టిన అంశానికి సంబంధించిన విశ్వ‌స‌నీయ‌మైన ఆధారాల‌ను గుర్తించామ‌ని, ఇది మాన‌వ‌త్వానికి జ‌రిగిన హింస అని యూఎన్ త‌న రిపోర్ట్‌లో చెప్పింది. మైనార్టీల హ‌క్కుల్ని కాలరాసేందుకు జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాల‌ను చైనా వాడుకున్న‌ట్లు ఆరోపించింది. యూఎన్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల హై క‌మీష‌న‌ర్ ఈ నివేదిక‌ను త‌యారు చేశారు. ఖైదీల‌ను చాలా నీచంగా చూశార‌ని, లైంగిక వేధింపులు కూడా జ‌రిగిన‌ట్లు యూఎన్ త‌న రిపోర్ట్‌లో ఆరోపించింది.

- Advertisement -