విజయ్‌పై ఉదయనిధి కామెంట్స్..టీవీకే కౌంటర్!

1
- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు ముదిరింది. శాసనసభలో డీఎంకే (DMK) అవినీతిపై ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యక్తిగత విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై అధికార తమిళగ వెట్రి కజగం (TVK) శ్రేణులు ఘాటుగా స్పందించాయి.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. గత డీఎంకే ప్రభుత్వం పార్టీ నిధుల సేకరణ పేరిట ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని ఆయన నేరుగా ఆరోపించారు. తమ టీవీకే ప్రభుత్వం అవినీతిని గానీ ప్రజాధనం దుర్వినియోగం కావడాన్ని గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.

విజయ్ చేసిన ఈ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తక్షణమే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. అయినప్పటికీ స్పీకర్ విజయ్‌ను ప్రసంగం కొనసాగించాల్సిందిగా అనుమతించడంతో నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. అంతటితో ఆగకుండా విజయ్ తన ప్రసంగంలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి కనిపించకుండా పోయిన వ్యక్తి అనే కథను ప్రస్తావించారు. అలాగే స్టాలిన్ తరచూ చేసే ఒక చేతి సైగను విజయ్ అనుకరిస్తూ చూపించడంతో టీవీకే సభ్యులు బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు.

అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ విజయ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల గురించి విజయ్ మాట్లాడిన విధానాన్ని తప్పుబడుతూ…ఆయనకు రైతులపై గౌరవం లేదని ఆరోపించారు. ఆ తర్వాత రాజకీయ విమర్శల నుండి నేరుగా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఉదయనిధి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెంగల్పట్టు కోర్టులో “ఒక భార్య తన భర్త కోసం వెతుకుతోంది” అంటూ విజయ్ మరియు అతని భార్య సంగీత స్వర్ణలింగం మధ్య నడుస్తున్న విడాకుల కేసును ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు.

ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తూ డీఎంకే వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. అవినీతి ఆరోపణలపై తాము సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే డీఎంకే నేతలు ఇలాంటి వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని మండిపడింది.

Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!

- Advertisement -