ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు!

1
- Advertisement -

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో నైరుతి రుతుపవనాలు ఉధృతంగా మారడంతో బుధవారం ఉదయం నుండే ముంచెత్తుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా స్తంభింపజేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ ముంబై శివారు ప్రాంతాల్లో రాకపోకలకు అత్యంత కీలకమైన అంధేరీ సబ్‌వేలో భారీగా వరద నీరు చేరడంతో, వాహనదారుల భద్రత దృష్ట్యా అధికారులు దానిని తాత్కాలికంగా మూసివేశారు.

నగరంలో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న ప్రధాన ప్రాంతాల్లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ముందస్తుగా నీటిని తోడే పంపులను ఏర్పాటు చేసినప్పటికీ, వర్షం వేగం ఎక్కువగా ఉండటంతో అంధేరీ సబ్‌వేలో దాదాపు రెండడుగుల మేర నీరు చేరింది. దీంతో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు. కేవలం అంధేరీ మాత్రమే కాకుండా ధారవి, కింగ్స్ సర్కిల్, హింద్మాతా, కుర్లా, మరియు సైన్ వంటి లోతట్టు ప్రాంతాలలో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ ఉదయం ముంబై మరియు దాని పరిసర ప్రాంతాలలో రాబోయే 3 నుండి 4 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తక్షణ హెచ్చరిక జారీ చేసింది.పరిస్థితిని సమీక్షిస్తూ బీఎంసీ (BMC) నగర ప్రజలకు కీలకమైన భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.

పౌరులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.వర్షాల సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల సమీపంలో గానీ నిలబడవద్దని హెచ్చరించింది. సముద్రంలో అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున బీచ్‌లు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!

భారీ వర్షాల ప్రభావం రోడ్డు రవాణాపైనే కాకుండా ముంబై లైఫ్‌లైన్ అయిన లోకల్ రైళ్ల రాకపోకలపై కూడా పడింది. సెంట్రల్, హార్బర్ లైన్లలో రైళ్లు కొన్ని నిమిషాల ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా మున్సిపల్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -