నీరవ్ మోదీకి లండన్ కోర్టు షాక్

2
- Advertisement -

విదేశాలకు పారిపోయిన ప్రముఖ డైమండ్ వ్యాపారవేత్త నిరవ్ మోదీకి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుణ గ్యారెంటీ కింద ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కు నిరవ్ మోదీ 10.7 మిలియన్ డాలర్లు (రూ. 100 కోట్లకు పైగా) చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. లండన్ జైలులో ఉంటూ భారతదేశానికి అప్పగింత కాకుండా చట్టపరమైన పోరాటం చేస్తున్న మోదీ నుండి బకాయిలను వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్న బ్యాంకుకు ఈ తీర్పు ఒక పెద్ద విజయంగా భావించవచ్చు.

లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టులో జస్టిస్ సైమన్ టింక్లర్ మంగళవారం ఈ తీర్పును వెలువరిస్తూ…వ్యక్తిగత గ్యారెంటీ ప్రకారం బ్యాంకుకు బాకీ ఉన్న అసలు మొత్తం 4.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 38.9 కోట్లు) చెల్లించడానికి నిరవ్ మోదీ బాధ్యుడవుతారు. దీనికి బ్యాంకు పేర్కొన్న విధంగా వడ్డీని కూడా జోడించాలి. బ్యాంకుకు ఈ మొత్తాన్ని పొందే హక్కు ఎందుకు లేదో వివరించడానికి మోదీ తరఫున ఎలాంటి సరైన వాదనలు లేదా రక్షణ లభించలేదు అని స్పష్టం చేశారు.

ఈ వివాదం 2012లో దుబాయ్ కేంద్రంగా పనిచేసే నిరవ్ మోదీ సంస్థ ‘ఫైర్‌స్టార్ డైమండ్ FZE’కు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రుణానికి సంబంధించినది. ఆ తర్వాత ఏడాది (2013లో), ఒకవేళ సదరు కంపెనీ లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమైతే, తానే స్వయంగా ఆ రుణాన్ని చెల్లిస్తానని నిరవ్ మోదీ ఒక వ్యక్తిగత పూచీకత్తు పత్రంపై సంతకం చేశారు.

2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో జరిగిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రుణాన్ని రద్దు చేసి కంపెనీతో పాటు నిరవ్ మోదీని కూడా బకాయిలు చెల్లించాలని కోరింది. అయితే కోర్టు రికార్డుల ప్రకారం, ఈ నోటీసులకు మోదీ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!

- Advertisement -