తిరుమల తిరుపతి దేవస్ధానం జేఈఓ గా 2007 బ్యాచ్ ఐఎఎస్ అధికారి బసంత్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 3, 4 తేదీల్లో తిరుపతి జేఈవోగాను, తిరుమల ఇన్‌చార్జ్ జెఈవోగాను బాధ్యతలు చేపట్టనున్నారు. విశాఖపట్నం నగరాభివృద్ధి వీసీగా పనిచేస్తున్న బసంత్‌కుమార్ గతంలో చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గానూ విధులు నిర్వహించారు.అలాగే గతంలో గవర్నర్ వద్ద అధిక కాలం కార్యదర్శిగా పనిచేశారు.
బసంత్ కుమార్ గతంలో తాను తీసుకున్న సంచలన నిర్ణయంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. పెళ్లిలకు అనవసర ఖర్చు ఎందుకు అంటూ కేవలం రూ.16,000 ఖర్చుతోనే 2017లో తన కూతురు పెళ్లి చేశారు. అలాగే 2019 ఫిబ్రవరిలో రూ.18వేలతో తన కుమారుడి పెళ్లి చేసి మరోసారి తన సిప్లిసిటిని చాటుకున్నారు ఐఎఎస్ అధికారి బసంత్ కుమార్. కుమారుడి పెళ్లికి ఆయన రూ.18 వేలు ఖర్చు పెట్టగా.. వధువు తరఫు వారు రూ.18 వేలు ఖర్చు చేశారు.
తన బిడ్డల పెళ్లిళ్లకు అతిథుల దగ్గర్నుంచి ఆయన బొకేలు, గిఫ్టులేమీ తీసుకోలేదు.మీ బహుమానాలు వద్దు.. ఆశీస్సులు చాలని శుభలేఖలోనే స్పష్టంగా ముద్రించారు. ఏ తండ్రి అయినా తన బిడ్డల పెళ్లిలు గ్రాండ్ గా సెలబ్రెట్ చేయాలని అనుకుంటాడు..కానీ అందుకు భిన్నంగా అనవసర ఖర్చు వద్దని చెప్పిన ఈ అధికారిని దేశ వ్యాప్తంగా పలువురు ప్రశంసించారు.