తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాలకు అందిస్తున్న ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,931.18 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం నిధులకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కష్ట కాలంలోనూ ఆయా వర్గాల నిరుపేదలు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని ఎక్కడా ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఈ నిధులను విడుదల చేయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదనడానికి ఇదే నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సకాలంలో నిధులు విడుదల కావడానికి చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆసరా పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పైలేరియా వ్యాధిగ్రస్థులు, చేనేత, కల్లు గీత,హెచ్ ఐవీ వ్యాధిగ్రస్థులు కలిపి మొత్తం 38లక్షల, 72 వేల, 717 మంది ఈ పెన్షన్లు పొందుతున్నారు.