ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్ కట్టి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన సీఎం 2018 జూన్ కల్లా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసి తీరుతామని…వరంగల్ జిల్లాలో రెండు పంటలకు సాగునీరందిచ్చి తీరుతామని తెలిపారు. భూసేకరణ చట్టంపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సీపీఎం నేతలు దిక్కుమాలిన స్ట్రాటజీలతో రైతులతో చెలగాటం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. స్థానిక రైతులు మాత్రం మల్లన్నసాగర్కు అనుకూలంగానే ఉన్నారని…రైతులకు నష్టం కలిగితే ఎవరూ బాథ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
భూసేకరణ చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 254 ప్రకారం సంపూర్ణ అధికారం ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టానికి ఎన్నో రాష్ట్రాలు సవరణలు చేశాయని గుర్తుచేశారు. భూములు కోల్పోయిన బాధ తనకు తెలుసని…..మిడ్మానేరు ప్రాజెక్టు కోసం గతంలో మా కుటుంబం భూమి కోల్పోయిందన్నారు. ఆ బాధ ఎటువంటిదో తనకు తెలుసన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత పరిహారం ఇస్తున్నామని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ విలువకు మూడు రెట్లు పరిహారం మాత్రమే చెల్లించాలని కేంద్రం చట్టంలో ఉందన్నారు.
భూసేకరణ చేయకుండానే నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు కట్టారా? అని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నమూనాలు తయారు చేసేంది రాజకీయ నాయకులు కాదు, ఇంజినీర్లు అని గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాదని గుర్తచేశారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టునైనా భూసేకరణ లేకుండా కట్టారా? అని ప్రశ్నించారు.బహుళార్ధక సాధక ప్రాజెక్టులు కట్టినప్పుడు కొంత నష్టం జరగక తప్పదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో విపక్షాల రభస అంతా ఇంతా కాదన్నారు. మల్లన్నసాగర్లో అసాంఘీక శక్తుల అడ్డుకట్టవేసేందుకే పోలీసులను మొహరించామని తెలిపారు. ఎన్నిఅడ్డంకులు ఎదురైన మల్లన్నసాగర్ పూర్తిచేసి తీరుతామన్నారు.
ప్రతిపక్షాలు ఇప్పటికైన తమ వైఖరిని మార్చుకోని భూసేకరణ చట్టం బిల్లుకు మద్దతు తెలిపాలని సూచించారు.విపక్ష సభ్యుల అభ్యంతరాల మధ్య తెలంగాణ భూసేకరణ బిల్లుకు సభ అమోదం తెలిపింది.