కాంగ్రెస్.. ఓ దుర్మార్గపు పార్టీ

196
ktr speech
- Advertisement -

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నిజామాబాద్‌ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వారందరికి మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలకులు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమి లేదని, కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌.

గత పాలకుల ఏలుబడిలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలోనే ప్రాజెక్టుల రంగంలో యావత్‌ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా రికార్డు స్ధాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని ఎద్దేవా చేశారని, వారి మాటలన్నీ నీటి మూటలని తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందని, దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ ను అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఏమి గుర్తుకు రావని, పీవీ దహన సంస్కారాలను అధికారికంగా చేయలేని కాంగ్రెస్‌ పార్టీ పీవీని ఘోరంగా అవమానించిందన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణలో విద్యార్థుల చావులకు కారణం కాంగ్రెస్‌ పార్టీనేనని, కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు చెరువులను పట్టించుకోలేదని, తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దడానికి తమ ప్రభుత్వం అనునిత్యం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, తెలంగాణలోని బీడు భూములను కృష్ణా, గోదావరి నీళ్లతో తడుపుతామని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -