టీఆర్‌ఎస్ పార్టీ 2018 ఎన్నికల మెనిఫెస్టోను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మెనిఫెస్టోను పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావుతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలకు ఆలవాలమని అన్నారు.
హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని, నగరంలో తమ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పౌరునికి ఇబ్బంది కలిగించకుండా ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా చూశామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నివసించే ఆంధ్రా బిడ్డలు కూడా తెలంగాణేవారేనని , ఇక్కడ ఒక్క తెలంగాణ వాళ్లే కాదు.. ఆంధ్రా, రాయలసీమ ప్రజలు కూడా ఉంటారు. అందుకే ఆంధ్రా వాళ్లు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆంధ్రా వాళ్లు తెలంగాణ బిడ్డలే. కేసీఆర్ మీతో ఉంటడు. వాళ్లు ఇక్కడ ఉంటున్నారంటే వాళ్లు మా బిడ్డలే. వాళ్లు లోకల్ సర్టిఫికెట్లు కూడా తీసుకొవచ్చు. వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు.. దొర కొడుకుల్లాగా కలిసి ఉండండి.. అని సీఎం కేసీఆర్ అన్నారు.
మాట్లాడితే చంద్రబాబు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాడని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, రాజకీయ కోణంలోనే హైదరాబాద్‌ను చంద్రబాబు వాడుకోవాలని చూస్తున్నాడని, తెలంగాణపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నాడని సీఎం కేసీఆర్ విమర్శించారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజల దీవెనలతో మళ్లీ తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.