సమగ్ర భూ సర్వే పై నేడు (శనివారం) తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సంయుక్త సమావేశం ముగిసింది. రెండున్నర గంటలకు పై గా సాగిన సమావేశంలో భూ సర్వే పథకం ఆవశ్యకతను సీఎం వివరించారు.
80 సంవత్సరాల తర్వాత రాష్ర్టంలో భూ రికార్డులను ప్రక్షాళన చేసే విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతపై సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామ, మండల స్థాయి రైతు కమిటీల ఏర్పాటు పై సీఎం చర్చించారు.
సెప్టెంబర్ 2 నుంచి నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించాలని, ఈ సందర్భంగా ఏర్పాటుచేసే రైతుసంఘాల్లో రాజకీయాలు లేకుండా చూడాలని ఆయన సూచించారు. రెవెన్యూశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, భూములకు సంబంధించిన రికార్డులపై చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. భూ రికార్డులకు సంబంధించిన ఏ మార్పైనా.. నేరుగా రైతుల ద్వారానే జరగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు నూతన విధానాలపై అవగాహన కల్పించాలని సూచించారు.