బండి ప్లాన్ రివర్స్… సాగర్‌లో టీఆర్ఎస్‌కు జై కొడుతున్న జనం..!

133
- Advertisement -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ దూకుడు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తోంది. ముఖ్యంగా సాగర్‌లో ఎస్టీల ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌కు పోలింగ్ ముందు రోజురోజుకు మారిపోతున్న పరిణామాలు చూసి దిమ్మతిరిగిపోతుంది. సాగర్‌లోటీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూనే 35 ఏళ్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు మంత్రిగా జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి చేసిందేమి లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై రాళ్లదాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్న అరాచక పార్టీ బీజేపీని కడిగిపారేస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలను సైతం టీఆర్ఎస్ నేతలు ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. కాగా సాగర్‌లో దాదాపు 40 వేలకు పైగా లంబాడాల ఓట్లు ఉండడంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిగా అదే సామాజికవర్గానికే చెందిన రవినాయక్‌కు టికెట్ ఇచ్చి అభ్యర్థి గా ఎన్నికల బరిలో నిలిపాడు. గుర్రంబోడు గిరిజన భూముల వివాదంలో రాళ్లదాడి ఘటనతో పార్టీకి మైలేజీ వచ్చిందని, లంబాడాలు గంపగుత్తగా తమ సామాజికవర్గానికే చెందిన రవినాయక్ ఓట్లేస్తారని బండి లెక్కలు వేసుకున్నాడు.

అయితే సాగర్‌లో బండి ప్లాన్ పూర్తిగా రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ వర్గం ఓట్లపై బండి ఆశలు పెట్టుకున్నాడో..అదే వర్గం ప్రజలు టీఆర్ఎస్‌కు జై కొట్టడం బీజేపీ నేతలకు షాక్ ఇస్తోంది. తాజాగా సాగర్ నియోజకవర్గంలోని పల్లెప్రజలు, తండాల ప్రజలు టీఆర్ఎస్‌కు జై కొడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్న పల్లె ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కుమార్‌కే ఓటు వేస్తామని ప్రకటిస్తున్నారు. ఓట్లన్నీ గంపగుత్తగా కారుకే వేయాలని త్రిపురారం మండలంలోని పలు గ్రామాల వారు గురువారం తీర్మానించారు. త్రిపురారం మండలంలోని సత్యంపహాడ్‌ తండా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది. ఇక్కడ 632 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఊర్లో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రైతుబంధు లబ్ధిదారులే. దీనికితోడు గ్రామపంచాయతీ భవనం, సీసీరోడ్ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా నీరు, పల్లె ప్రగతితో పారిశుద్ధ్యం ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీలోని మూడు తండాల జనమంతా ఒక్కచోటకు చేరారు. దశాబ్దాలుగా ఇతర పార్టీలకు ఓట్లేస్తే జరిగిన ప్రయోజనం ఏమీ లేదని, టీఆర్‌ఎస్‌ పాలనలోనే అన్ని పథకాలు గ్రామంలోకి వచ్చాయన్న భావనతో అందరూ ఏకమయ్యారు.

ఇదే విషయాన్ని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌ నాయక్‌ ద్వారా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు తెలిపారు. ఇదే మండలంలోని రాజేంద్రనగర్‌ కూడా ఇటీవలే కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది. వీరు కూడా సమావేశమై టీఆర్‌ఎస్‌కే తమ ఓట్లని ప్రకటించారు. ఇక్కడ మొత్తం 536 మంది ఓటర్లు ఉండగా అందరూ కారు గుర్తుకు జైకొట్టారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అమలవుతున్న పథకాల లబ్ధిదారులు తమ ఊరిలో ఇంటికొక్కరు ఉన్నారని సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. త్రిపురారం మండలంలోని లచ్యాతండా ఆవాస గ్రామమైన బీస్యాతండా వాసులు సైతం సర్పంచ్‌ మంగ్తానాయక్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. చూశారుగా ఏ లంబాడాల ఓట్లపై నమ్మకం పెట్టుకుని, బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ అదే సామాజికవర్గానికే చెందిన రవినాయక్‌ను అభ్యర్థిగా నిలిపితే…అదే సామాజికవర్గం అధికార టీఆర్ఎస్‌కు జై కొట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తమను ఎస్టీల జాబితానుండి తొలగించడానికి బండి సంజయ్ ఆదివాసీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి కుట్రలు చేయడం కూడా బీజేపీ పట్ల లంబాడాల్లో ఆగ్రహానికి కారణమైంది. సాగర్‌‌లో పోలింగ్‌కు ముందు మారుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ అభ్యర్థి రవినాయక్‌కు డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా సాగర్ నియోజవర్గంలో తండాలన్నీ టీఆర్ఎస్‌కు జైకొట్టడం బండి సంజయ్‌‌కు, బీజేపీ నేతలకు షాకింగ్‌గా మారింది.

- Advertisement -