ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు తెలంగాణ భవన్‌లో 105 మంది పార్టీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ భేటీలో నియోజకవర్గాలవారీగా పర్యటనల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈనెల 22 లేదా 23 నుంచి రోజుకు రెండూ లేదా మూడు నియోజకవర్గాల చొప్పున సీఎం పర్యటించే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ పాక్షికంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు సాయం తదితర హామీలు ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించనున్నారు.
105 నియోజకవర్గాల్లో తాజా సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థుల అభిప్రాయాలు, ఇతర అంశాలను తెలుసుకోవడంతోపాటు అసమ్మతి వాదులు, అసంతృప్తులకు సంబంధించిన అంశాలు, పార్టీ శ్రేణులతో సమన్వయం ఇతర అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.