లోక్ సభలో తలాక్ బిల్లు.. వ్యతిరేకించిన ఒవైసీ ..!

197
- Advertisement -

త్రిపుల్‌ తలాఖ్ కు నేడు కేంద్రం చెక్‌ పెట్టింది. త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే చారిత్రాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లును ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. దీనిపై చేపట్టిన చర్చ సందర్భంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.

 Triple Talaq Bill introduced in Lok Sabha

ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, చట్టపరంగా కూడా పొందిక లేదని వ్యాఖ్యానించారు. ఆయనకు బీజేడీ ఎంపీ బర్తృహరి మహతబ్‌ మద్దతు తెలుపుతూ.. ఈ బిల్లు దోషపూరితంగా ఉందని, ఇందులో చాలా వైరుఢ్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రవిశంకర్‌ ప్రసాద్‌ వీటికి సమాధానాలిచ్చారు.

ఇది చారిత్రకమైన రోజుని, మనం చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన బిల్లు అని, సుప్రీంకోర్టు నిషేధం విధించినా.. ఇంకా ట్రిపుల్ తలాక్ చెబుతూనే ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా దీనికి వ్యతిరేకంగా చట్టమేమీ లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెప్పిందని, అలాంటప్పుడు ఇది కొనసాగడానికి పార్లమెంట్ ఎలా అంగీకరిస్తుంది అని బిల్లు ప్రవేశపెట్టే సమయంలో రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఇది ముస్లిం మహిళల హక్కులను పరిరక్షిస్తుందే తప్ప ఏ మతానికి, ఆచారానికి వర్తించదని పేర్కొన్నారు.

 Triple Talaq Bill introduced in Lok Sabha

నేరుగా, రాత రూపేణా, లేదా ఈ మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సప్ సందేశాలను పంపినా..నేరంగాను, చెల్లనిదిగాను పరిగణిస్తూ కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. అలా చెప్పిన భర్తలకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, జీవన భృతి కోరడానికి వీలుంటుంది. మైనర్‌ పిల్లల సంరక్షణపైనా న్యాయమూర్తి ద్వారా ఉత్తర్వులు పొందవచ్చు. కాగా…త్రిపుల్ తలాక్ పై ప్రవేశపెట్టిన బిల్లును ప్రధాన ప్రతిపక్షాలు వ్యతిరేకించగా బీజేపీతో పాటు మిగతా పార్టీలు స్వాగతించాయి.

- Advertisement -