జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మెడికల్ కళాశాలలోని కోవిడ్ వార్డులో రోగులకు వసతుల కల్పనపై ఆదివారం సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. హాస్పిటల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జయశ్రీ, మెడికల్ కళాశాల, ఏరియా ఆసుపత్రి అధికారిక సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. హాస్పిటల్ లో సిబ్బంది పని తీరుపై ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో వారు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. “కరోనా కష్ట కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది రావొద్దు, బాధ్యతగా పనిచేసి, కోవిడ్ రోగులకు భరోసాను ఇవ్వాలి. వ్యక్తుల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు రావొద్దు. బాధ్యతాయుతంగా పని చేయక విస్మరించిన వారిపై చర్యలు తప్పవు మంత్రి హెచ్చరించారు. ఆసుపత్రికి అవసరమైన అడ్మినిస్ట్రేటీవ్- వ్యవస్థపరమైన అంశాలపై గ్యాప్ ఉంటే ఏ రకమైన అవసరం ఉన్న, మా దృష్టికి తీసుకురావాలి. ప్రతి ఒక్క వైద్య ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలి.” అని మంత్రి సూచించారు.