అప్పుడప్పుడు పెద్ద సినిమాల ప్రభావం లేకపోవడంతో చిన్న సినిమాల బాగానే హడావుడి చేస్తుంటాయి. అలాగే ఈ వారం చిన్న సినిమాల హవా బాగానే కొనసాగనుంది. ఎప్పుడో షూటింగ్ అయిపోయినా ఇంకా రిలీజ్ కు నోచుకోని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత రాబట్టాలని చాలా ఆశలు పెట్టుకొని మినీ సినిమాలతో పోటీకి దిగనున్నాయి. మొత్తంగా ఈ శుక్రవారం అరడజనుకుపైగా సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల్లో ఎంతో కొంత అంచనాలను పెంచిన సినిమాలు కూడా ఉన్నాయి.
ముందుగా రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ ఈ శుక్రవారం విడుదలయ్యే వాటిలో కొంచెం పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు. దాదాపు 20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. సన్నీ లియెన్ ఐటెమ్ సాంగ్ ఇప్పటికే హై రేంజ్ లో హాల్ చల్ చల్ చేస్తోంది. ఫైనల్ గా నవంబర్ 3న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక చాలా రోజుల తర్వాత లవర్ బాయ్ సిద్దార్థ్ కూడా సరికొత్తగా రాబోతున్నాడు. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన గృహం అనే సినిమా ద్వారా తన లక్ ని టెస్ట్ చేసుకుంటున్నాడు.
ఇక ఎన్నో రోజుల నుండి విడుదల డేట్ పై కన్ఫ్యూజన్ కి గురి చేసిన హెబ్బా పటేల్ – ఏంజెల్ ఫైనల్ గా ఈ శుక్రవారమే రాబోతోంది. ఈ సినిమాలో అన్వేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈటివి ప్రభాకర్ డైరెక్ట్ చేసిన నెక్స్ట్ నువ్వే కూడా ఇదే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది కూడా హర్రర్ చిత్రమే. ఆది సాయి కుమార్ – రష్మీ గౌతమ్ ఈ సినిమాలో ఉన్నారు. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.