టెక్ దిగ్గజం యాపిల్ (Apple) సీఈవోగా 15 ఏళ్ల పాటు అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన టిమ్ కుక్ (Tim Cook) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో యాపిల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ (John Ternus) బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం 65 ఏళ్ల వయస్సున్న టిమ్ కుక్, సెప్టెంబర్ 1, 2026 వరకు సీఈఓగా కొనసాగుతారు. ఆ తర్వాత ఆయన తన బాధ్యతలను జాన్ టెర్నస్‌కు అప్పగించి, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ (Executive Chairman) గా వ్యవహరిస్తారు. దీనివల్ల కంపెనీ నాయకత్వ మార్పు సజావుగా సాగుతుందని యాపిల్ భావిస్తోంది.
యాపిల్ తదుపరి సీఈఓగా బాధ్యతలు తీసుకోబోతున్న జాన్ టెర్నస్ (50) 2001లో యాపిల్‌లో చేరారు. గత 25 ఏళ్లుగా కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఐఫోన్ (iPhone), మ్యాక్ (Mac), ఐప్యాడ్ (iPad) మరియు ఇటీవల విడుదలైన విజన్ ప్రో (Vision Pro) వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తుల ఇంజనీరింగ్ విభాగాలను ఆయన పర్యవేక్షించారు.
జాన్ టెర్నస్ ఒక విజనరీ. యాపిల్ సంస్కృతిని, విలువలను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన సరైన వ్యక్తి” అని టిమ్ కుక్ తన వీడ్కోలు సందేశంలో కుక్ కొనియాడారు. 2011లో స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత యాపిల్ పగ్గాలను అందుకున్న టిమ్ కుక్..కంపెనీని ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన నాయకత్వంలో యాపిల్ మార్కెట్ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.
యాపిల్ వాచ్ (Apple Watch), ఎయిర్‌పాడ్స్ (AirPods) మరియు సర్వీసెస్ (Services) విభాగాలను విజయవంతంగా ప్రవేశపెట్టి కంపెనీ ఆదాయ మార్గాలను విస్తరించారు. స్టీవ్ జాబ్స్ హయాంలో ఉన్న వినూత్న శైలిని కొనసాగిస్తూనే, ఆపరేషన్స్ మరియు సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో యాపిల్‌ను తిరుగులేని శక్తిగా మార్చారు.
Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే: కేసీఆర్

