పులిని పంపిస్తేనే పాట ట్యూన్‌ చేసిస్తా..అనిరుద్

303
Music Anirudh
- Advertisement -

యువ తమిళ సంగీత సంచలనం అనిరుద్ రవిచంద్రన్ భయపడ్డాడు! ‘కొలవెరి డీ’ కుర్రాడి ముందుకు ఒక్కసారిగా పులి రావడంతో కంగారు పడ్డాడు! తన మనుషులను పిలుస్తూ కేకలు పెట్టాడు! సడన్‌గా సిటీలోకి టైగర్ ఎక్కడ నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? తనంతట తానుగా ఏదో అడవిలోంచి నగరం లోపలికి పులి రాలేదు. దర్శకుడు హరీష్ రామ్ తీసుకొచ్చారు. అనిరుధ్ దగ్గరకు పంపారు.

ఎందుకు? అంటే… అనిరుధ్ రవిచంద్రన్ అడిగారు. పులిని పంపమని అనిరుధ్ ఎందుకు అడిగారు? అంటే… ఓ పాట చేసిపెట్టమని హరీష్ రామ్ అడిగితే ఫీల్ రావడం కోసం పులిని పంపమని అడిగారు. దర్శకుడు అలాగేనని పంపారు. తర్వాత ఏమైంది? పులి వచ్చింది! అనిరుధ్ రవిచంద్రన్‌లో ఫీల్ కూడా! వెంటనే ట్యూన్ చేసేశారు. ఆ పాటను ‘తుంబా’లో వినొచ్చు.

Thumbaa

ఇంతకీ, అనిరుద్ రవిచంద్రన్‌ని అంతగా భయపెట్టినదీ… కంగారు పెట్టినదే… కేకలు పెట్టించిన పులి నిజమైనది కాదులేండి.. విజువల్ ఎఫెక్ట్స్ పులి. అవును… నిజమే! గ్రాఫిక్స్ ద్వారా సృష్టించిన ఆ పులిని చూస్తే… ప్రేక్షకులు కూడా నిజమైన పులి అని నమ్మేస్తారు. ఒక్క పులి మాత్రమే కాదు.. మా సినిమాలో కోతి, ఇతర జంతువులను చూస్తే, నిజమైన జంతువులే అనే అనుభూతి కలుగుతుందని నిర్మాత సురేఖ అంటున్నారు.

దర్శన్, ధీనా, కీర్తీ పాండ్యన్ ప్రధాన తారాగణంగా సురేఖ న్యపతి సమర్పణలో ఏ రీగల్ రీల్స్ ప్రై.లి., రోల్ టైమ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘తుంబా’. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి హరీష్ రామ్ ఎల్.హెచ్. దర్శకుడు. సురేఖ న్యపతి నిర్మాత. ముగ్గురు సంగీత దర్శకులు స్వరాలను అందిస్తున్నారు. ముగ్గురిలో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు.

Thumbaa

వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను గురువారం (ఫిబ్రవరి 21న) అనౌన్స్ చేశారు. తెలుగులో సాయి ధరమ్ తేజ్, తమిళంలో కీర్తి సురేష్, మలయాళంలో నివిన్ పౌలీ, హిందీలో పాప్ సింగర్ బాద్షా ఈ ‘తుంబా’ టైటిల్‌ను తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్‌లో ఉందీ వీడియో. ప్రేక్షకుల నుంచి టైటిల్‌కి, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోకి అద్భుత స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత సురేఖ న్యపతి మాట్లాడుతూ – ” పెద్దలకూ, పిల్లలకూ… అందరికీ నచ్చే ఫాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘తుంబా’. దర్శకుడు హరీష్ రామ్ వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నత స్థాయిలో ఉంటాయి. తెరపై కనిపించే జంతువులు నిజమైనవే అనేంతలా విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్న వీడియోను గురువారం ప్రోమోగా విడుదల చేశాం. అందులో కనిపించే పులి నిజమైనదని చాలామంది అనుకుంటున్నారు. అది గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినదే. ఈ ప్రోమో జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో మరిన్ని అద్భుతాలు ఉంటాయి. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం ” అన్నారు.

- Advertisement -