ఉద్యమ నినాదంలో సాగునీటి విజయమిది..

791
kaleshwaram project
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 45 లక్షల ఎకరాలకు సాగునీరు,తాగునీరు అందించే బృహత్ లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 21న జాతికి అంకితం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ ప్రారంభోత్సవానికి గవర్నర్ నరసింహన్‌తో పాటు మహారాష్ట్ర సీఎం పడ్నవీస్,ఏపీ సీఎం జగన్‌ హాజరుకానున్నారు.

దేశసాగునీటి చరిత్రలో ఇంత త్వరగా పూర్తైన ప్రాజెక్టు ఇప్పటివరకు లేదు. 2016లో శంకుస్థాపన జరుగగా 2019లో కేవలం మూడు సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో మొదటి పోరాటమూ నీళ్ల కోసమే. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ నేడు బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా ఏటికి ఎదురేగి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నారు సీఎం కేసీఆర్.

గుండెనిండా తడి ఉన్నా… ఇన్నాళ్లూ తెలంగాణ పొలం మడికి మాత్రం నిండుగా తడి చేరలేదు. నీరు పల్లమెరుగు అనే సామెతను తిరగరాసి వరద గోదారికి మెరక నడక నేర్పబోతోంది. ఉపనది ప్రాణహిత నీటిని జీవనదిలోకి ఎత్తిపోసి గోదావరికి కొత్త జీవం ఇవ్వబోతోంది కాళేశ్వరం.

ఇదో అద్భుతం…మహా యజ్ఞం.. భగీరథ యత్నం ..మూడు బ్యారేజీల్లో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని ఎత్తిపోయడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన 139 మెగావాట్ల బాహుబలి మోటార్లను ఉపయోగిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సస్యశ్యామలం కానుంది.నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ఉద్యమ నినాదంలో సాగునీటి విజయమిది.

కాళేశ్వరంతో మూడేళ్ల తర్వాత ఇకపై రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూసే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో గోదావరి పారే ప్రతి పాయా ఇక సంజీవనే.. ఆ పాయల కింది పొలాలన్నీ అపరభగీరథుడు కేసీఆర్‌ కృషి ఫలితంగా సజీవమే కానున్నాయి.

- Advertisement -