కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కడకడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ దేశం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. బ్యాంకాక్‌లో ఇంటి నుంచి బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేకుంటే 20 వేల బాట్ల (రూ. 47,610) జరిమానా విధిస్తోంది. అయితే ఈ నిబంధన సామాన్య ప్రజలకే కాదు దేశ ప్రధానికి కూడా వర్తిస్తుంది రుజువైంది.
ఇటీవల మాస్క్ ధరించని థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు 6వేల బాట్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14,270) జరిమానా విధించారు. అధికారులతో సమావేశం సందర్భంగా ప్రధాని మాస్క్ ధరించనందుకు గాను ఈ జరిమానా విధించారు. వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి ప్రధాని ప్రయూత్ నిన్న సలహాదారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాస్క్ ధరించలేదు.
అయితే అది గమనించిన బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్ ముయాంగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిపై తాను ఫిర్యాదు చేసినట్టు గవర్నర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ప్రధాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో అధికారులు ఆయనకు జరిమానా విధించారు.