తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో అన్ని భాషల చిత్రాలకు వీలుగా జాతీయస్థాయి హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఫిలిండెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి థియేటర్ వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలిసారిగా పదవి అలంకరించిన ఆయన ‘తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్’ సభ్యులకు గుర్తింపు కార్డుల ప్రధాన కార్యక్రమంలో మాట్లాడారు.
శుక్రవారం ఎఫ్‌డిసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సభ్యులందరికీ గుర్తింపు కార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన జర్నలిస్టుల సంఘాన్ని అభినందిస్తూ… ఎఫ్‌డిసి పరంగా ఏవైనా సౌకర్యాలు వుంటే తగు విధంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే చిత్రరంగం గురించి పలు విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా సినీమా జర్నలిస్టుకు ప్రభుత్వపరంగా ఒనగూరే హెల్త్‌కార్డుతోపాటు ఇతర సౌకర్యాలు పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి తగినవిధంగా సహకరిస్తామన్నారు.
చిత్రపరిశ్రమలో ప్రతి ఏడాది 150మంది కొత్త నిర్మాతలు వస్తున్నారనీ, వారి సమస్యలనూ అన్ని తెలిసిన జర్నలిస్టులు కూడా తమముందుకు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌ఎల్‌పి పేరుతో వున్న కొంతమంది నిర్మాతలు మోనోపొలీగా మారాయనే విమర్శలు వస్తున్నాయనీ, మీడియా అందరికీ తగిన విధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దసరానుంచి థియేటర్లలో ఐదు ప్రదర్శలకు అనుమతి వస్తుందన్నారు. ఆ ఆటను చిన్న సినిమాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు.
ఇంతకుముందు బాలల చిత్రాలు నిర్మించేవారికి ప్రోత్సాహంగా ఇచ్చే 15 లక్షల సబ్సిడీని రెండింతలు పెంచేలా చర్యలు తీసుకోకున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రస్థాయిలో ప్రతి ఏటా ఇచ్చే అవార్డుకు ఇంకా పేరు నిర్ణయించలేదనీ త్వరలో ఆ పేరును ప్రకటిస్తామన్నారు. ఇక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తగినట్లు తెలంగాణ సినిమాకు ప్రత్యేక గుర్తింపు విషయంలో నియమనిబంధనలను అనుగుణంగా ఆలోచిస్తామన్నారు. ఆన్‌లైన్ టిక్కెట్ విషయంలో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందనీ త్వరలో ఆ నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు.
అనంతరం తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరాజు మాట్లాడుతూ… అసోసియేషన్ ఏర్పడి ఏడాదిపైగా అయిందనీ, అప్పటినుంచీ ఆపదలో వున్న జర్నలిస్టులకు, తీవ్ర అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న వారికి అసోసియేషన్ ముందుకు వచ్చి సాయం చేసిందని గుర్తు చేశారు. మా అసోసియేషన్ ఎఫ్‌డిసి సహకారాన్ని కూడా ఆశిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి గోరంట్ల సత్యం, కోశాధికారి రాధాకృష్ణ, చిన్నమూల రమేష్, అడ్ల రాంబాబు, పి.ఎస్.ఎన్. రెడ్డి, అశోక్, మురళీ, సుజన్, శ్రీపాల్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.