తెలుగుదనం వెల్లి విరిసింది.. పద్యాల తోరణాలు…కవితల పన్నీరు వెరసీ ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. తెలుగు భాషామతల్లికి అక్షర నీరాజనాన్ని..తెలంగాణ సాహిత్యానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. తెలుగు భాష వేళ్లూనుకుంది తెలంగాణలోనే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రభుత్వం వంద శాతం సక్సెస్ అయింది.
17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, 42 దేశాలు, తెలంగాణలోని 31 జిల్లాల నుంచి 8 వేల మంది ప్రతినిధులతో తెలుగు మహాసభలు పరిపూర్ణమయ్యాయి. కవులు రచయితలు,సాహితీ వేత్తలు,చరిత్రకారులు,కళాకారులతో తెలుగుకు పూర్వవైభవం వచ్చింది.తెలుగును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ నిర్వహించిన కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి.
మహాసభల నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాహిత్య అకాడమీ పకడ్బందీగా నిర్వహించింది. నిర్వాహక కమిటీ, సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాలను విజయవంతం చేశాయి. మహాసభల ప్రారంభం…ముగింపు వేడుకలు ఓ జాతరను తలపించింది. తెలంగాణ చరిత్ర, సాహిత్యం, జీవనం, కళలు, దేవాలయాలు, పర్యాటకం, తెలంగాణ సాహిత్యం మహాసభల్లో వెల్లివిరిసింది.
అన్నిటికీ మించి భాషలో విశేషమైన పట్టు ఉన్న కేసీఆర్ ఈ సభలపై తనదైన ముద్ర వేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ల నుంచి సామాన్యుడి దాకా ప్రతి ఒక్కరూ ఆయన భాషా వైదుష్యాన్ని విశేషంగా ప్రస్తుతించారు.
సాంసృతిక సమావేశానికి సినీ గ్లామర్ కొత్త శోభ తీసుకొచ్చింది. టాలీవుడ్ అతిరథ మహారథుల రాకతో మహాసభలకు కొత్త కలర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ దిగ్గజాలు నందమూరి బాలకృష్ణ, మోహన్‌బాబు, సూపర్‌స్టార్ కృష్ణ, కే రాఘవేంద్ర రావు, నాగార్జున, వెంకటేష్, రాజమౌళి, రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, గిరిబాబు, అశ్వనీదత్, సుమన్, జయసుధ, జగపతిబాబు, తమ్మారెడ్డి భరద్వాజ, విజయ్ దేవరకొండ, పోసాని కృష్ణ మురళి, ఎన్ శంకర్, హరీష్ శంకర్, ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చేసిన అన్ని ఏర్పాట్లలోకీ.. భోజనం, వసతి భేష్ అని ఆహూతులందరూ ముక్తకంఠంతో కొనియాడారు. అతిథులు బస చేసిన చోటు నుంచి సభల ప్రాంగణానికి రాకపోకలకు ఉచిత రవాణా ఏర్పాటు చేయడం వంటివాటిపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టినపుడు చాలా మంది ఈ ఆలోచనను తేలిగ్గా తీసుకున్నారు. ప్రస్తుతం ఇది అనవసరమని, బంగారు తెలంగాణ నిర్మాణం సాగుతున్నపుడు ఈ భాషా సమావేశాలు ఎందుకని ప్రశ్నించిన వారూ ఉన్నారు. కానీ ఐదురోజుల పాటు సాగిన ప్రపంచ మహాసభలు ముగిశాక సింహావలోకనం చేస్తే చాలా మందిలో భాషా స్పృహ కలగడానికి ఇవి దోహదపడ్డాయని అనిపించకమానదు.