సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువకాలం ఆఫర్లతో దూసుకుపోవడం కష్టమే. అయితే ఒక హీరోయిన్ తనకు కలిసొచ్చిన సమయంలో ఎంతగా ఆధిపత్యం చలాయించినప్పటికీ.. ఆ హవా ఎంతో కాలం కొనసాగదు. అలా కొనసాగినా..ఐదారేళ్లకు మించి టాప్ రేంజిలో కొనసాగడం కష్టం. కొందరు పదేళ్ల పాటు కూడా తమ ఉనికిని చాటుకుంటుంటారు. కానీ అంతకుమించి హీరోయిన్లు హవా సాగించడం కష్టం.
అందులోనూ ఒకసారి ఒక హీరోయిన్‌కు క్రేజ్ తగ్గి, ఆఫర్లు లేకపోతే మళ్లీ పుంజుకోవడం చాలా కష్టం. ఇక ఆఫర్లు రాకపోతే ఇంకేం చేస్తారు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. అంతేకానీ.. హీరోల్లాగా దశాబ్దాలు దశాబ్దాలు కొనసాగడం అన్నది హీరోయిన్లకు అసాధ్యం. ఐతే త్రిష మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.
ఒకప్పుడు తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగిన త్రిష.. ఆ తర్వాత లైమ్ లైట్లోంచి వెళ్లిపోయింది. అవకాశాలు తగ్గిపోవడంతో క్రేజ్ పడిపోయింది. ఇంకేముంది ఇక రిటైర్మెంటే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆ మధ్య వరుణ్ మణియన్ అనే తమిళ నిర్మాతను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోవడానికి కూడా త్రిష రెడీ అయింది. కానీ అతడితో ఎంగేజ్మెంట్ ఆగిపోవడం, త్రిష కెరీర్ ఊపందుకోవడం ఒకేసారి జరిగాయి. దాంతో వరుసగా మంచి అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది త్రిష. ప్రస్తుతం త్రిష ఖాతాలో ఆరు సినిమాలుండటం విశేషం.
అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘సామి-2’ గురించే. 14 ఏళ్ల కిందట విక్రమ్ సరసన త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సామి’. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులో విక్రమ్‌నే హీరోగా ఎంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ త్రిషనే కథానాయికగా తీసుకోవడం మాత్రం ఆశ్చర్యమే. దీంతో పాటుగా మోహని.. గర్జనై.. 1818.. శతురంగ వేట్టై-2.. హేయ్ జూడ్.. 96 అనే ఐదు సినిమాల్లో త్రిష కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ల వయసులో ఒక సౌత్ హీరోయిన్.. ఇంతటి ఊపు చూపించడం అన్నది మామూలు విషయం కాదు.