బస్తీల సుస్తీ పోగొట్టెందుకు తెలంగాణలోని బస్తీల్లో బస్తీ దవాఖానాలను సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నూతన అకాడమిక్ భవన సముదాయానికి గురువారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లాంటి నగరంలో ఐఐపీహెచ్ సంస్థ ఉండడం మంచి విషయమన్నారు. 2015లో సీఎం కేసీఆర్ 45 ఎకరాల భూమి ఐఐపీహెచ్‌కు ఇచ్చారని, అలాగే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి రూ.10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. ఇటీవల ప్రజలు, ప్రభుత్వాలు ప్రజారోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవసరమైన వసతులు సమకూర్చుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ఐఐపీహెచ్ ప్రెసిడెంట్ శ్రీనాథ్‌రెడ్డి, బోర్డ్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కృషికి మంచి ఫలితాలు వచ్చాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతితో మలేరియా, డెంగ్యూ జ్వరాలు తగ్గాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆరోగ్య సూచికల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధించామన్న మంత్రి హరీశ్.. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించిందని గుర్తు చేశారు. వైద్యసేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందన్నారు. నగరాలు, పట్టణాల్లో మురికి వాడలు ఎక్కువగా ఉంటాయని, దీంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 259 బస్తీ దవాఖానాల ద్వారా వైద్యం అందుతోందని… ఈ పథకం బాగా ఉందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించిందన్నారు. తెలంగాణలో ప్రజా ఆరోగ్యం బలోపేతానికి 630 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పబ్లిక్ మేనేజ్‌మెంట్ పర్సన్ నియమించి.. మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నమన్నారు. అంతేకాకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఐటీ వింగ్ సైతం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపేందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించుకున్నామన్నారు. రూ.6,295 కోట్ల నుంచి రూ.11,440 కోట్లకు పెంచుకున్నామన్నారు. తెలంగాణ వార్షిక బడ్జెట్లో 4.5 శాతం ఆరోగ్య రంగంపై వెచ్చిస్తున్నామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ సంవత్సరం కేవలం 1.1 శాతం మాత్రమే కేటాయించిందని, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కడుతున్నామని, దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో ఆరు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను విస్తృతం చేసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో మనం ముందున్నామని, వైద్య ఆరోగ్య రంగంలో కూడా తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.