గ్రీన్ ఛాలెంజ్‌…టీయూలో మొక్కలునాటిన లింబాద్రి..

271
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పించిన “గ్రీన్ చాలెంజ్” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి తెలంగాణ విశ్వవిద్యాలయంలో 500 మొక్కలు నాటే లక్ష్యంతో గురువారం నాడు ఉదయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జొగినపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ చాలెంజ్ – గ్రీన్ ఇండియా” కార్యక్రమం దేశంలోనే గొప్ప స్ఫూర్తిని నింపుతుందని, ఈ సంకల్పం ఎందరో నాయకులను, యువకులను, విద్యార్థులను, మేధావులను, సెలబ్రెటీలను, మొత్తంగా ప్రజలందరిని ముందుకు తీసుకొని వెళ్తుందని అన్నారు. నేడు ఆదర్శప్రాయంగా నిలిచిన కార్యక్రమం ఈ “గ్రీన్ చాలేంజ్” ఒకటే అని కొనియాడారు.

నిజంగా దీని అవసరం ఎంతో ఉందని చెబుతూ కెనడా దేశంలో సగటున ఒక్కరికి 8,900 మొక్కలు ఉండగా, భారతదేశంలో సగటున ఒక్కరికి 28 మొక్కలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇది చాలా ప్రమాద ఘంటికలు సూచిస్తున్న సమయమని, సందర్భం కూడా అని విచారం వ్యక్తం చేశారు. వాతావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు చేస్తున్న హెచ్చరికల దృష్ట్యా… గౌరవ ఎం. పి. సంకల్పించిన “గ్రీన్ చాలెంజ్” మానవాళి మనుగడకు భద్రత కలిగిస్తుందని అన్నారు. ఈనాడు దేశమంతా ఈ కార్యక్రమంలో అంతర్భాగం కావడం విశేషమన్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కలువకుంట్ల చంద్రశేఖర్ రావు 2014 నుంచి “హరితహారం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.

తాను రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు నాటి ఎం. పి. కలువకుంట్ల కవిత, నాటి ఉపకులపతి సీనియర్ ఐఎఎస్ మరియు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సి. పార్థసారథి నేతృత్వంలో టీయూ క్యాంపస్ లో 2014, 2015 సం|| లలో “తెలంగాణకు హరితహారం ” కార్యక్రమాన్ని నిర్వహించామని గుర్తుచేశారు. లైబ్రరీ ఎదుట చక్కని ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని మొక్కలు నాటి గార్డెన్ గా తయారు చేశామని, నేడు అవి పెరిగి విద్యార్థులకు మేధో పరమైన ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విగ్నంగా హరితహారం కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నో లక్షల మొక్కలను నాటారని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి రక్షణ, పోషణ కల్పించారని, అవి చక్కగా పెరుగుతూ క్యాంపస్ పచ్చని అటవీ ప్రాతాన్ని తలపిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

టీయూ కొండలు గుట్టలు కలిగిఉన్న ప్రదేశం కాబట్టి “రాష్ట్రంలో పచ్చని ప్రదేశానికి చిరునామా” గా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య నసీం మాట్లాడుతూ… ఈ గ్రీన్ చాలెంజ్ లో భాగంగా తల ఒక్కరు మూడేసి మొక్కలు నాటే దీక్షను పూనాలని అన్నరు. ప్రతి పల్లె, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం తద్వారా ప్రపంచం పచ్చగా ఉండాలని అభిలషించారు. ప్రతి సంవత్సరం క్యాంపస్ లో మొక్కలు నాటుతున్నమని గుర్తుచేశారు. 2018 మరియు 2019 సంవత్సరాలలో 1,10,825 మొక్కలు నాటే టార్గెట్ ఇచ్చారని, మొక్కలు నాటి టార్గెట్ పూర్తి చేశామని తెలిపారు. ఈ సంవత్సరం “తెలంగాణకు హరితహారం – 2020” ని ఉపకులపతి సీనియర్ ఐఎఎస్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ గారి నేతృత్వంలో 5,400 మొక్కలకు గెస్ట్ హౌస్, యూనివర్సిటి కాలేజ్, వీసీ రెసిడెన్సీ పరిసర ప్రదేశాలను ఎంచుకొని నాటుతున్నామని పేర్కొన్నారు. వేప, మర్రి, చింత, ఉసిరి, జిట్టగన్నేరు, నెమలినార, నారవేప, కుంకుడు, బ్రొచెర, అల్లనేరేడు, కనుగు, నిద్రగన్నేరు, గుల్మోరా, కదంబ తదితర మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య కనకయ్య, కంట్రోలర్ డా. ఘంటా చంద్రశేఖర్, ఈ సీ మెంబర్స్ డా. మారయ్య గౌడ్, డా. వసుంధరాదేవి, కళాశాల ప్రిన్సిపల్ డా. ఆరతి, డా. రవీందర్ రెడ్డి, డా. ఆంజనేయులు, డా. సంపత్ కుమార్, శ్రీమతి భ్రమరాంభిక, శ్రీ సంపత్, పీఆరో డా. వి. త్రివేణి, వినోద్ కుమార్, సాయాగౌడ్, భాస్కర్ తదితర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్తులు మీడియా మిత్రులు పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -