బంగారు తెలంగాణ…చరిత్రాత్మక విజయయాత్ర

304
kcr
- Advertisement -

బంగారు తెలంగాణ సాధించే దిశగా చరిత్రాత్మక విజయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో సాయుధ బలగాల గౌరవందనాన్ని స్వీకరించారు సీఎం. అనంతరం మాట్లాడిన తెలంగాణ ఏర్పడిన అనతికాలంలోనే కష్టాలను అధిగమించామని చెప్పారు. ప్రజలు టీఆర్ఎస్‌ని ఆదరించి ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు.

బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను నిజం చేస్తున్నామని చెప్పారు. అనతికాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి,సంక్షేమ పథకాలకు తెలంగాణ రోల్ మాడల్‌ అన్నారు. సంపద సృష్టించాని..ఆ సంపదను ప్రజలకు పంచాలనే సూత్రంతో ముందుకు పోతున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎవరు ఇవ్వలేని విధంగా పెన్షన్లు తెలంగాణలో ఇస్తున్నమని చెప్పారు.

40 వేల కోట్లతో 40 పథకాలతో ప్రజాసంక్షేమానికి పాటు పడుతున్నామని చెప్పారు. గ్రామీణ వ్యవస్థ బాగుంటేనే ఆర్ధిక వ్యవస్థ బాగుంటుందని తమ ప్రభుత్వ అభిమతమని ఆ దిశగా అడుగులు వేస్తూ సత్ఫలితాలు సాధించామన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేశామన్నారు. పెద్ద ఎత్తున గోదాంల నిర్మాణం,నీటి తీరువా బకాయిల రద్దు చేసి వ్యవసాయానికి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి 5వేల ఎకరాలను ఒక అధికారిని నియమించి వ్యవసాయాన్ని పండుగ చేయబోతున్నామని చెప్పారు.

సమైక్య రాష్ట్రంలో సాగునీటి విషయంలో జరిగిన అన్యాయన్ని సవరించి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ధృడ సంకల్పంతో ముందుకుపోతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల కల సాకారం చేయబోతున్నామని చెప్పారు. అంతరాష్ట్ర వివాదాలకు తావులేకుండా ప్రాజెక్టుల రిడిజైనింగ్ చేపట్టమాన్నారు. గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. అంతరాష్ట్ర ఒప్పందాలను సాధించుకోగలిగామని చెప్పారు. నదిజలాల వినియోగంపై కేంద్ర జలసంఘం అనుమతులు సాధించుకున్నామని చెప్పారు.

kcr secundrabad

ఆదిలాబాద్ జిల్లాలో ఛనాకా కొరటా బ్యారేజ్ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తిచేసి తీరుతామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర బడ్జెట్‌లో ఏటా 25 వేల కోట్లు కేటాయించామన్నారు. పాలమూరు ప్రజల కన్నీరు తుడిచి వారి పొలాలకు సాగునీరు అందించే విధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. పాలమూరుతో పాటు నల్గొండ,వికారాబాద్‌కు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుందన్నారు.

ఓ వైపు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే కొత్త ప్రాజెక్టులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామని చెప్పారు. పాలమూరు పచ్చని పంటల జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భక్తరామదాసుతో పాడేరు నియోజకవర్గం సస్యశ్యామలం అయిందన్నారు. గోదావరి నది జలాలను సమగ్రంగా వినియోగించుకునేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరంతో 38 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఇప్పటికే అన్నిరకాల అనుమతులు సాధించి రికార్డు స్ధాయిలో పూర్తిచేయబోతున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం తెలంగాణకు జీవధారగా మారబోతుందని గవర్నర్ నరసింహన్‌ కొనియాడారని గుర్తుచేశారు.

మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. సాగుభూమి విస్తీర్ణంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్నిప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు బంధు పథకం తీసుకొచ్చామన్నారు. ఎకరాకు రూ. 8వేల పెట్టుబడి అందించే ఈ పథకం రైతన్నలకు భరోసా ఇచ్చిందని…గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. కొంతమంది సంపన్న వర్గాలకు చెందిన రైతులు,దాతలు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు తిరిగి ఇచ్చేస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వారి మేనిఫెస్టోలో ప్రస్తావిస్తున్నారని తెలిపారు.

రైతు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునే విధంగా జీవిత భీమా పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. పదిరోజుల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు అందజేస్తామని..ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకాన్ని ముందుకు తీసుకురాబోతున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి రైతులకు భీమా పథకం అందుబాటులోకి వస్తుందన్నారు.

భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి అందరికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. పట్టాపాస్‌బుక్‌లో చెక్కులు జూన్‌ 20లోగా అందరికి అందిస్తామని తెలిపారు. రైతులు పాస్‌ బుక్కులు కుదువ పెట్టుకోకుండానే రుణాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. అన్నిమండలాల తహసిల్దార్‌లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. ధరణి అనే వెబ్‌ సైట్‌ ద్వారా భూముల వివరాలు తెలుసుకొవచ్చన్నారు.

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావాలంటే కుల వృత్తులు బాగుపడాలన్నారు. యాదవులకు గొర్రెల పంపిణీ చేపట్టామన్నారు. రాష్ట్రంలో పశుసంపద గణనీయంగా పెరిగిందన్నారు. చేపల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పిన కేసీఆర్ అన్ని కులాల వారికి ఆర్ధిక సహాయం అందిచబోతున్నామని చెప్పారు. గౌడన్నలను ఆదుకునేందుకు తాటి,ఈత చెట్లను పంపిణీ చేస్తామన్నారు. పాడి రైతులను ఆదుకుంటామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా శుభ్రమైన మంచినీరు అందిస్తామని తెలిపారు సీఎం.

తెలంగాణలో 5682 కిమీల జాతీయ రహదారులు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇంటి నిర్మాణం పేరుతో బిల్లులు కాజేశారని…వారిపై విచారణకు ఆదేశించామన్నారు. నిరుపేదల ఆత్మగౌరవం పెంచేలా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా ప్రభుత్వ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. హైదరాబాద్‌ లక్షకు పైగా డబుల్ ఇండ్లు నిర్మించబడుతున్నాయని చెప్పారు.

కేసిఆర్ కిట్ ద్వారా నిరుపేద గర్బిణి స్త్రీలకు 12 వేల రూపాయలను అందిస్తున్నామన్నారు. ఈ పథకం అమలు తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటివరకు 2 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కిడ్నీ వ్యాధిగస్త్రుల కోసం 30 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు తెలంగాణకు జాతీయ స్ధాయిలో అవార్డులు వచ్చాయన్నారు. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు పేరుతో ఉచిత కంటి చికిత్సను అందిస్తామన్నారు.

కేజీ టూ పీజీ పథకం ద్వారా అందరికి నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురుకులాలను తీసుకొచ్చామన్నారు. సివిల్స్‌లో టాపర్‌గా తెలంగాణ బిడ్డ నిలవడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆకాంక్షించిన సీఎం…విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి సాయం అందచేస్తామన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా ఆకుపచ్చ తెలంగాణ కోసం కృషిచేస్తున్నామన్నారు.

గాంథీజి కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేశామన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలకు మహర్దశ రాబోతుందన్నారు. తండాలను,గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చామని తెలిపారు. ఎస్సీలకు గ్రామపంచాయతీ పదవుల్లో రిజర్వేషన్ లభిస్తుందన్నారు.

తెలంగాణ పారిశ్రామిక విధానానికి మంచిస్పందన వచ్చిందన్నారు. రాష్ట్రంలో అనేక కొత్త పరిశ్రమలు తరలివచ్చాయని 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఐటీలో తెలంగాణ బలీయమైన శక్తిగా ఎదిగిందన్నారు. ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. టీ హబ్‌ స్టార్టప్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శాంతిభ్రదతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గుడుంబాను అరికట్టామని..పేకాట క్లబ్‌లను మూసివేశామన్నారు. వ్యవసాయ రంగానికి ముప్పుగా పరిణమించిన కల్తి విత్తనాలపై కొరడా విధించామని పీడీ యాక్టు అమలు చేస్తున్నామని తెలిపారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ప్రగతి దారుల వెంట పయనిస్తుందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైన అవిశ్రాంతంగా శ్రమించి బంగారు తెలంగాణ కోసం పాటుపడుదామని పిలుపునిచ్చారు సీఎం.

- Advertisement -