అల్లం సార్‌కు ఆత్మీయ వీడ్కోలు

24
- Advertisement -

దశాబ్ద కాలం పాటు తనతో పని చేసిన సిబ్బందిని కలిసి వారితో ముచ్చటించి వీడ్కోలు తీసుకుందామని వెళ్లిన అల్లం నారాయణ సారుకు నిండైన హృదయంతో… బరువైన గుండెలతో… ఆ సిబ్బంది కంటి నుండి అప్రయత్నంగా వస్తున్న కన్నీళ్లు స్వాగతం పలికాయి….పదేళ్లుగా ఆయనతో ఉన్న అనుబంధం, ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సంబంధం ఇక ఆ కార్యాలయంలో భవిష్యత్తులో ఉండదనే నిజాన్ని జీర్ణించుకోలేక బరువెక్కిన గుండెలతో భారంగానే తమ చైర్మన్ సార్ కు ఘనమైన వీడ్కోలు పలికి ఆ సిబ్బంది తమ ప్రత్యేకతను చాటడం నాకు కనిపించింది. మనసున్న మహారాజు గా అల్లం సారు వారి హృదయాల్లో ఎంత సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారో వారి ఆత్మీయ వీడుకోలు ను చూసి నాకు అనిపించింది. రాజు ఎక్కడున్నా రాజు యే నని….

తెలంగాణ రాష్ట్ర తొలి మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదిన్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనునిత్యం జర్నలిస్టుల సంక్షేమమే పరమావధిగా భావించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేసి తనదైన మార్క్ చూపించిన అల్లం నారాయణ సార్ మీడియా అకాడమీ చైర్మన్ గా పదవీ విరమణ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెచ్చిన 42 కోట్ల సంక్షేమ నిధితో దాదాపు 18 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన ఏకైక మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు అని చెప్పడంలో సందేహం లేదు. గత ఏడేళ్లుగా మరణించిన దాదాపు 500 మంది జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వటమే కాకుండా నేటికీ నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ ఇచ్చి వారి కుటుంబాలకు అండదండయ్యాడు. కరోనా కష్టకాలంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలను జర్నలిస్టులకు సత్వర సహాయం కింద విడుదల చేసి మానవత్వాన్ని చాటుకుని మహనీయుడు అనిపించుకున్నారు. సాహిత్య పరంగా ఆరు పుస్తకాలను ప్రింట్ చేసి బావి జర్నలిస్టుల కోసం, వారి శిక్షణకు సహాయపడేలా అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలలో జర్నలిస్ట్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి దాదాపు పదివేల మంది జర్నలిస్టుల కు పైగా శిక్షణను ఇప్పించి అకాడమీ చైర్మన్ పోస్ట్ కే వన్నె తెచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో తను సాధించిన విజయాలు ఉన్నాయి. చివరగా దాదాపు 15 కోట్ల రూపాయల నిధులతో శాశ్వత మీడియా అకాడమీ భవనాన్ని తన హయాంలో భవిష్యత్ తరాల కోసం ఎంతో ముందు చూపుతో నిర్మించిన తీరు నిజంగానే అభినందనీయం. కంప్యూటర్ శిక్షణ ద్వారా జర్నలిజం కోర్స్ పెట్టాలని ఒక ప్రత్యేక హాలు నిర్మించడంతోపాటు, ఆడిటోరియం నిర్మాణం చూస్తే నిజంగా నాకైతే ముచ్చటేసింది. నిర్మించిన హాల్లో ఎంతో గొప్పగా శిక్షణ తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది.

ఆ నిర్మాణాన్ని చూస్తేనే తెలుస్తుంది తెలంగాణ జర్నలిస్టులకు ఎంతో చేయాలనే తపన, ఒక విజన్ అల్లం నారాయణ గారికి మాత్రమే ఉందని దానిని చూసిన ఎవరైనా ఒప్పుకోక తప్పదేమో…చివరగా ఒక మాట…. మీడియా అకాడమీ చైర్మన్ గా తనకంటూ ఒక బెంచ్ మార్క్ ను సృష్టించుకున్న అల్లం నారాయణ గారిని దాటాలంటే రేపు భాద్యతలు చేపట్టబోయే వారు ఇంతకంటే మించి సంస్కరణలు తేగలరా, తెచ్చి అమలు చేయగలరా అనేది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్న..అన్నారు ఆస్కానీ మారుతి సాగర్.

Also Read:Vinod Kumar:ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం బాధాకరం

- Advertisement -