2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలు మర్చిపోలేని రోజు. 60ఏండ్లుగా తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్న దినం. నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే కేసీఆర్ నినాదంతో ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. ఆనాటి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యమ ఫలితమే నేడు తెలంగాణ జాతి అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణాలు పనంగా పెట్టి దీక్షకు కూర్చొవడంతో కేంద్రం తలొగ్గి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసింది. సరిగ్గా పదేళ్ల క్రితం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటించిన దినం. తెలంగాణ వచ్చుడో అంటూ బక్కపలచని నేత కేసీఆర్ ఆమరణ దీక్ష బలంగా మారి యావత్ దేశాన్ని కదిలించిన రోజు. మా తెలంగాణ మాగ్గావలే అంటూ నినదించిన గొంతులు ఢిల్లీకి సెగలా తగిలాయి.
చివరకు తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంతో యూపీఏ సర్కార్ 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చింది. డిసెంబర్ 9న అర్ధరాత్రి 11.30గంటలకు తెలంగాణపై ప్రకటన చేశారు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం.ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారు కేసీఆర్. ఆయన దీక్షతో అంతవరకు తెలంగాణ ఏర్పాటుపై స్పందించని యూపీఏ సర్కార్ లో చలనం మొదలయింది.
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కు జరగరానిది జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదని ఆలోచించారో ఏమోగానీ డిసెంబర్ 9 రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009 నవంబర్ 29న నిరాహార దీక్షకు ఉపక్రమించారు. దీంతో రోజురోజుకీ రాష్ట్ర సాధన ఉద్యమం మరింత జోరందుకుంది. దీక్ష మొదలైన మూడవరోజు అంటే డిసెంబర్ 1న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఉన్నా లేకున్నా.. ఉద్యమం నడవాలని ప్రకటన చేశారు. దీంతో ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. ఇక డిసెంబర్ 3న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యం అందించడానికి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. 2009 డిసెంబర్ 9న కేసీఆర్ ఆరోగ్య స్థితిగతులపై పార్లమెంట్ లో పెద్ద చర్చే జరిగింది. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వివిధ పక్షాల నేతలు సూచించారు.