ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకాడమిక్ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కింగ్ కాలేజ్ పనిచేస్తుంది. యూకే పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్ & లైఫ్ సైన్సెస్) కింగ్స్ హెల్త్ పార్ట్నర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్ లు అవగాహనా ఒప్పందం పై సంతకాలు చేశారు. గత నెలలో బ్రిటిష్ కౌన్సిల్ నేతృత్వంలో కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్‌తో సహా కింగ్స్ ప్రతినిధులు భారతదేశం లో పర్యటించారు. దానికి కొనసాగింపుగా ఇవాళ లండన్ లోని కింగ్స్ కాలేజ్ క్యాంపస్ ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. తాజా ఒప్పందంతో ఫార్మా రంగ ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తన సహకారాన్ని అందిస్తుంది. ఫార్మా సిటీ , లైఫ్ సైన్సెస్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ విజన్ కు కింగ్స్ కాలేజ్ తన తోడ్పాటును అందిస్తుంది.
ఈ సందర్భంగా కింగ్స్ కాలేజ్ లండన్ ప్రెసిడెంట్ & ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శితిజ్ కపూర్ మాట్లాడుతూ… టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తాజా ఒప్పందం దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన తమ యూనివర్సిటీ ఇప్పటికే ఇండియాలోని ప్రతిష్టాత్మక సంస్థలతో అకాడమిక్ అంశాల్లో కలిసి పనిచేస్తోందన్నారు. ముంబైలోని టాటా మోమోరియల్ సెంటర్ తో కలిసి ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ స్టడీ నిర్వహిస్తున్నామన్నారు.
కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం భారత్, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతుందన్నారు. లైఫ్ సైన్సెస్ & ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ఫార్మా సిటీ విజన్‌లో భాగమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. ఫార్మా పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత నైపుణ్యం గల యూనివర్సిటీతో తమ ప్రభుత్వం కలిసి పనిచేయడంపై సంతోషంగా ఉందన్నారు.