రద్దు చేసేది బీజేపీ…పద్దులు ఇచ్చేది టీఆర్‌ఎస్‌: హరీశ్‌రావు

52
- Advertisement -

చేనేతరంగ అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్‌ ఏంచేసిందో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని మంత్రి హరీశ్‌ రావు నిలదీశారు. చేనేతరంగం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కార్మికుల పొట్టకొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని టెస్కో కార్యాలయంలో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ సమక్షంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. రద్దులు చేసిన ఘనత బీజేపీది.. పద్దులు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ది అని వ్యాఖ్యానించారు. చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నదని చెప్పారు. రూ. 350 కోట్ల నిధులతో బతుకమ్మ చీరల కోసం చేనేత కార్మికులకు ఆర్డర్లిచ్చామన్నారు. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా తీసుకొచ్చామని, రూ.5 లక్షలు బీమా కల్పిస్తున్నామని చెప్పారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అంటే చేనేత కార్మికులకు రోల్ మోడల్‌ అని తెలిపారు.

వరంగల్‌లో మెగాటెక్స్‌టైల్ పార్కును 1250 ఎకరాల్లో ఏర్పాటు చేశామన్నారు. రెండు పెద్ద కంపెనీలు అక్కడ పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు, పవర్ లూమ్ బోర్డులను 2014లో తీసుకొచ్చిన త్రిఫ్ట్స్ ఫండ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రద్దులు చేసిన ఘనత బీజేపీది.. పద్దులు ఇచ్చిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది అని చెప్పారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పేదల ప్రభుత్వమని వెల్లడించారు.

- Advertisement -