తెలంగాణలో పారిశ్రామిక వృద్ది రేటు పెరిగిందన్నారు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన 2017-2018 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. దేశంలోనే తెలంగాణ నెం1 స్ధానంలో ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా పెరిగాయన్నారు. పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఈసందర్భంగా పలు కంపెనీలతో ప్రభత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ది వైపు దూసుకెళ్తుందన్నారు పలువురు ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న పలువురు పారిశ్రామిక వేత్తలు, ఉత్తమ కంపెనీలకు పారిశ్రామిక అవార్డులు అందజేశారు మంత్రి కేటీఆర్.
ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…2017-18 సంవత్సరంలో తెలంగాణ పారిశ్రామిక వృద్ది రేటు 10.4 శాతం పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో పలువురు కంపెనీ ప్రతినిధులు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ. 1,23,478 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈపెట్టుబడుల ద్వారా 5లక్షల 27వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 55 శాతం అధికంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.