హుజుర్ నగర్ నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మరోసారి కూడా అన్యాయం చేస్తున్నారని మహాకూటమి నేతలపై మండిపడ్డారు. మహాకూటమి పొత్తులో భాగంగా తమకు ఒక్క సీటును కూడా కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేవారు.
ఈసందర్భంగా ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరుల స్ధూపం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహాకూటమి నేతలే తన దగ్గరకు వచ్చి పొత్తులో భాగస్వామ్యం కావాలని చెప్పారన్నారు. ఇప్పుడు ఒక్క సీటు కూడా ప్రకటించకపోవడం తమను అవమానపరచడమే అన్నారు. తమను ఢిల్లీకి పిలిచిన అక్కడ తమను పట్టించుకున్న వారే లేరని మండిపడ్డారు.
మహాకూటమి అభ్యర్దుల జాబితా ఇప్పుడు అమరావతిలో తయారవుతుందని ఆయన విమర్శించారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్, టీడీపీలు సామాజిక న్యాయాన్ని గాలికి వదిలేశారన్నారు. తాజాగా ప్రకటించిన మహాకూటమి అభ్యర్దుల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.