తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ఊరట కలిగించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య ఫిర్యాదు చేసిన కేసులో ఆయనకు ఒక వారం పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు పాస్‌పోర్ట్ వివాదానికి సంబంధించినది. పవన్ ఖేరా చేసిన ఆరోపణలపై అసోం సీఎం భార్య రింకిని భుయాన్ శర్మ గువాహటి క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసోం పోలీసులు కేసు నమోదు చేశారు.
హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ కే. సుజనా, ఖేరాకు ఒక వారం గడువు ఇస్తూ సంబంధిత కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో ఆయనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించారు.
ఈ వివాదం ఏప్రిల్ 4న ఖేరా నిర్వహించిన ప్రెస్ మీట్ తర్వాత ప్రారంభమైంది. ఆ సందర్భంగా ఆయన, సీఎం భార్యకు అనేక దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సీఎం కుటుంబం పూర్తిగా ఖండించింది.
ALso Read:KTR:జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం
ఈ ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 5న కేసు నమోదు కాగా, తర్వాత ఖేరా ఢిల్లీలోని నివాసంలో పోలీసులు తనిఖీలు కూడా నిర్వహించారు. అనంతరం ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఖేరా తరఫు న్యాయవాదులు ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని వాదించగా, అసోం పోలీసులు మాత్రం ఇది తీవ్రమైన ఆరోపణలతో కూడిన కేసు అని కోర్టులో పేర్కొన్నారు.

