తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014లోనే కేసీఆర్… జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారని కేటీఆర్ వెల్లడించారు. అయితే అప్పట్లో తాను కాంగ్రెస్‌కు కట్టుబడి ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశం లేదని జీవన్ రెడ్డి సున్నితంగా చెప్పారని గుర్తుచేశారు.
కేసీఆర్, జీవన్ రెడ్డిల మధ్య నాలుగు దశాబ్దాల స్నేహబంధం ఉందని, అది రాజకీయాలకు అతీతమని కేటీఆర్ వివరించారు. కరీంనగర్‌కు సీఎం హోదాలో వచ్చినప్పుడు కూడా మొదటి మాట చెప్పే అవకాశం జీవన్ రెడ్డికే ఇచ్చారని చెప్పారు.
జగిత్యాల ప్రజల సమస్యలపై జీవన్ రెడ్డి చూపిన పట్టుదలను కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్న బ్రిడ్జ్ కావాలని జీవన్ రెడ్డి కోరగానే, వెంటనే బోర్నపల్లి వద్ద రూ.75 కోట్ల వ్యయంతో వంతెనను మంజూరు చేశారని తెలిపారు.
ఇది కేసీఆర్ ప్రజా సమస్యలపై స్పందించే తీరు, జీవన్ రెడ్డి ప్రభావాన్ని చూపించే ఉదాహరణగా పేర్కొన్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన కేటీఆర్, ఆయనను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయంపై జిల్లా నాయకత్వం మొత్తం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి బలాన్నిస్తుందని, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఇది దోహదం చేస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.జీవన్ రెడ్డి కూడా రెండు మూడు రోజుల్లో కేసీఆర్‌ను కలిసి తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారని చెప్పారు.
రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్, జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలను అవమానిస్తున్నారని ఆరోపించారు.ప్రజల పాలన మెరుగుపడాలంటే జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞుల సహకారం అవసరమని పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రయాణంపై భావోద్వేగంగా స్పందించారు జీవన్ రెడ్డి. ఎన్టీఆర్, చిన్నారెడ్డి, వైఎస్, చంద్రబాబు వంటి అనేక ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవం తనకు ఉందన్నారు.అందరిలోకెల్లా కేసీఆర్ పాలన మెరుగైనదని ప్రశంసించారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి, గత రెండేళ్లలో తగ్గిపోయిందని విమర్శించారు. వ్యక్తిగతంగా మానసిక క్షోభతో పాటు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం..రాజకీయాల్లో నేను చివరి దశలో ఉన్నాను, ఒక ఎన్నిక చూసే అవకాశం ఉండొచ్చు…ఈ దశలో కేసీఆర్‌తో పాత జ్ఞాపకాలను నెమరేసుకోవాలని ఉంది అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

