ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లె దవాఖానాలకు పూర్తి స్థాయిలో వైద్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాధమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 4745 ఏఎన్‌ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయంచింది. ఈ పల్లె దవాఖానాల్లో 1492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో నెంబర్ 1563 జారీ చేసింది.
రాష్ట్రంలోని 3206 సబ్ సెంటర్లలో 1492 మంది వైద్యుల నియామకం చేయనుండగా, మరో 636 సబ్ సెంటర్లు పీహెచ్‌సీల పరిధిలోనే ఉన్నాయి. అంటే మొత్తంగా 3842 సబ్ సెంటర్లలో డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇప్పటికే ఆశాలు ఎఎన్‌ఎంలు రోగికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఇప్పుడు వాటిని పల్లె దవాఖానాగా మార్చుతూ వాటిల్లో 1492 మంది వైద్యులను నియమిస్తుండటంతో మరింత నాణ్యమైన సేవలు పల్లెల్లో అందుతాయని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి…